పేరు ఆదర్శం.. నిర్వహణ అధ్వానం
– రేకుల షెడ్టులో డిగ్రీ తరగతులు
– కోట్ల రూపాయల భవనం వృథా
– కొత్త కోర్సుల ఊసే కరువు
– ప్రయివేటుకు తరలుతున్న విద్యార్థులు
ఆత్మకూరురూరల్
వెనకటికెవరో కొండంత రాగం తీసి పిసరంత పాటపాడారని అంటుంటారు. సరిగ్గా ఈ పోలిక ఆత్మకూరు ఆదర్శ డిగ్రీ కళాశాలకు సరిపోతుంది. సుమారు రూ.12 కోట్ల వ్యయంతో 41,630 చదరపు గజాల్లో నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ రూసా నిర్మించింది. ఇందులో తరగతి గదులు, కాన్పరెన్స్ హాల్‌లు, ఈ –క్లాస్ రూంలు, వెయిటింగ్ రూంలు లాబరేటరీలను ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని జూన్3 న అప్పటి కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి స్మతీ ఇరాని ఢిల్లీ నుంచి సాఫ్ట్ లాంచ్ ద్వారా ప్రారంభించారు. ఇంత ఆర్భాటంగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక కళాశాలలో చదువుకోవాలన్న కోరిక విద్యార్థులలో కలగడం సహజం. అయితే కళాశాల తెరచి ఇప్పటికి నెలరోజులు కావస్తున్నా కొత్త భవనాన్ని వాడడం లేదు. కొత్త కోర్సుల్లో అడ్మిషన్లు జరపడం లేదు. ప్రవేశాల కోసం 200కు పైగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 70 మంది మాత్రమే డిగ్రీ మొదటి సంవత్సరం సాధారణ కోర్సుల్లో చేరారు. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల్లో వీరికి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు అభ్యంతర చెబుతున్నా..ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త భవనం ఉన్నా.. రేకుల షెడ్లలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇవీ సమస్యలు..
ఆత్మకూరు ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా రెండు హాస్టల్ భవనాలు నిర్మించారు. అయితే అందుకు సంబంధించి వార్డెన్లను, వంట సిబ్బందిని, పారిశుద్ధ్య సిబ్బందిని నియమించలేదు. కళాశాల తరగతులకు అవసరమైన డెస్క్‌లు, నల్లబల్లలు, లాబరేటరి ఎక్విప్ మెంట్‌ల కొనుగోలు జరపలేదు. కళాశాల ప్రారంభానికి చూపిన శ్రద్ధ.. తరగతుల నిర్వహణకు చూపకపోవడంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి రూసా భవనం.. విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. ఆధునిక సదుపాయాలతో ఆత్మకూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభం కానుందన్న వార్తలు పత్రకల్లో పతాక శీర్షికల్లో రావడంతో విద్యార్థులంతా అక్కడికే వెళతారని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. కొత్త భవనాల్లో తరగతులు నిర్వహించేందుకు వీరే అడ్డంకులు సృష్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
సాధారణ కోర్సులు మాత్రమే..
ఆంగ్ల మాధ్యమంలో బీఎస్సీ కంప్యూటర్సు, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ బీజెడ్సీ వంటి కోర్సులు చదవాలని ఆశపడ్డ గ్రామీణ విద్యార్థులకు నిరాశే ఎదురైంది. మోడల్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీకాం, బీఏ వంటి సాధారణ డిగ్రీ కోర్సులు మాత్రమే ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చారు. కొత్త కోర్సులకు అనుమతులు రాలేదని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో విద్యార్థులకు భోధన చేసేందుకు చక్కటి ప్యాకల్టీ అందుబాటులో ఉంది. ఉన్నత విద్యార్హతలు గల బోధన సిబ్బంది ఉన్నారు. డిగ్రీ ద్వితీయ, తతీయ సంవత్సరాల్లో మొత్తం సుమారు 250 మంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో బోధన మాత్రం రేకుల షెడ్‌లలో జరుగుతోంది. అందుకే మొదటి సంవత్సరం డిగ్రీ కోసం కేవలం డెభ్భై మంది మాత్రమే చేరారు. చాలా మంది విద్యార్థులు ప్రయివేటుకు పరుగులు తీశారు.
డిగ్రీ కళాశాలను సొంత భవనంలోకి మార్చాలి
– గోవింద్ గౌడ్, ఆత్మకూరు
ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలను వెంటనే రూసా భవనాల్లోకి మార్చాలి. కళాశాల ప్రిన్స్‌పాల్ ఈ విషయంలో చొరవ చూపాలి. ఉన్నతాధికారులను సంప్రదించి తరగతుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. కొత్త కోర్సుల కోసం విశ్వవిద్యాలయాన్ని సంప్రదించాలి.