రాష్ట్రాంలో మోడీ జోష్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి దక్కించుకునే దిశగా భారతీయ జనతా పార్టీ కదన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఆదివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే పార్టీ మహా సమ్మేళనానికి గ్రేటర్‌లోని 24 శాసనసభ నియోజకవర్గాల క్యాడర్ హాజరుకాబోతోంది. నగరాన్ని కాషాయ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించి ఆయా రూట్లలో సాయంత్రం భారీ ప్రదర్శనల ద్వారా సభావేదికకు చేరుకోవాలని కార్యకర్తలకు సూచనలు చేసింది.
ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి భారీ ఓటమిని మూటగట్టుకున్న బీజేపీ, గత గాయాల భారీ నుండి ఉపశమనం పొందేందుకు ఆర్నెళ్ల సమయం తీసుకోగా, ఇక గ్రేటర్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణాలు, పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు పరిష్కరించుకుని, ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లే దిశగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం ఆశించి నిరాశకు గురైన అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షునిగా పదవీ కాలం కూడా పూర్తి కావటంతో ఆయన గత ఆర్నెళ్లుగా పూర్తిగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా ఆయన సైతం నియోజకవర్గానికే పరిమితం కావటం, కేంద్ర మంత్రి దత్తాత్రేయ పూర్తిగా తన శాఖ కార్యకలాపాలతోనే సరిపెడుతుండగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధిక్కార ధోరణితో నగరంలో పార్టీ పరిస్థితి పూర్తి గందరగోళంగా మారిపోయింది. కానీ తాజాగా పార్టీ హైకమాండ్ ఆదేశాల నేపథ్యంలో లక్ష్మణ్‌తో పాటు కిషన్‌రెడ్డి కూడా క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధం కావటం, రాజాసింగ్ కూడా తిరిగి పార్టీ ముఖ్య నేతలతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తుండటం పార్టీకి కలిసివచ్చే అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాని సభ అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ పరిస్థితిని సమీక్షించనుండటంతో ముఖ్య నేతల ఐక్యతారాగం పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్‌ని తెచ్చిపెట్టింది.
భారీగా తరలిరండి
ఆదివారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో జరిగే ప్రధాన మంత్రి సభకు నగర వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని బీజేపీ నగర అధ్యక్షులు వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోన్న నరేంద్రమోదీ సారథ్యంలో ఆదివారం నిర్వహించే సభ తెలంగాణలోని పార్టీ శ్రేణులకు ఉత్సాహానిచ్చేందుకు ఉపయోగపడుతుందన్న ధీమాను వెంకట్‌రెడ్డి వ్యక్తం చేశారు.