తుగ్లక్‌ను గుర్తుకుతెచ్చిన మోదీ నిర్ణయం
వరంగల్ : దేశంలో రైతులు, చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చూస్తుంటే పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి మోదీ నిర్ణయం తుగ్లక్‌ను గుర్తుకు తెచ్చిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రీజినల్ కోఆర్డినేటర్ పీసీ.విష్ణునాథ్ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పెద్ద నోట్ల రద్దుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో, విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని మోదీ ప్రకటించారన్నారు.
నోట్ల రద్దుతో 50రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని, అనంతరం ఉంటే తనను ఉరితీయాలని మోదీ ప్రకటన చేశారని, ప్రస్తుతం ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నందున ఏం చేయాలో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. నోట్ల రద్దు వల్ల పాత రూ.500, రూ.1000 నోట్లు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పాలని పీఎం మోదీని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. ఈ విషయంపై ఆర్‌బీఐని ప్రశ్నించినా వారి వద్ద నుంచి కూడా ఎలాంటి సమాచారమూ రావడం లేదని విష్ణునాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుతో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. పీఎం మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి నష్టం జరుగుతున్న విషయాలను గుర్తించి ఆ పార్టీ నేతలు ఇప్పుడు తప్పుడు నిర్ణయం అని బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు కొన్ని రోజుల ముందు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలతో ఆస్తులను కొనుగోలు చేశాయన్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు బీహార్‌లో 8, ఒడిషాలో 14 ఆస్తులను రూ.3.41కోట్లకు కొనుగోళ్లు చేసిన విషయాన్ని కాంగ్రెస్ బహిర్గతం చేసిందన్నా రు. మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ ఏకపక్షంగా తీసుకోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. దేశంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకునే ముందు లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి తీసుకుంటారని, అలా కాకుండా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు.
ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుండెబోయిన విజయరామారావు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరెపల్లి మోహన్, కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, ఆరోగ్యం, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ నాయకులు కట్ల శ్రీనివాస్‌రావు, రాజనాల శ్రీహరి, టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్తుండగా పోలీ సులు అడ్డుకొని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.