ఆకలివేటలో మృత్యువాత
హనుమాన్ జయంతి రోజున కోతిపిల్ల మృతి
పాపన్నపేట: కోతిపిల్లను హనుమంతుని ప్రతిరూపంగా చూస్తాం. శుక్రవారం ఓవైపు లోకమంతా హనుమాన్ జయంతి జరుపుకుంటున్న సందర్భంలో ఓ కోతిపిల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మండలంలోని ఎల్లాపూర్ బ్రిడ్జిపై చోటు చేసుకుంది. కరువు ప్రకోపానికి మనుషులే కాదు మాగజీవాలు విలివిలలాడుతున్నాయి. తాగు నీటికి, బుక్కెడు తిండి కోసం మలమలా మాడుతున్నాయి. కోతుల పరిస్థితి మరీ ఘోరం. అడవులన్నీ ఖాళీ అయ్యాయి. ఊళ్ళోకి వస్తే జనం వెంటపడుతున్నారు. అందుకే మంజీరా నదిలో అక్కడక్కడా చిన్న చిన్న మడుగుల్లో నిలిచి ఉన్న నీటిని తాగుతూ ఎల్లాపూర్ బ్రిడ్జిపై ఆహారం కోసం ప్రతిరోజు కోతుల మంద పడిగాపులు కాస్తోంది. ప్రయాణికులు ఎవరైనా తినుబంఢారాలు పడే స్తే పరుగులు తీసి ఆకలి తీర్చుకుంటూ బతుకీడిస్తున్నాయి. ఈ క్రమంలో ఆకలి వేటలో ఉన్న ఓ కోతి వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో బ్రిడ్జిపై నుంచి వెళ్లే జనాలంతా హనుమాన్ జయంతి రోజు ఆయన ప్రతిరూపం అసువులు బాసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.