2, 3 రోజుల్లోనే అండమాన్‌కు ‘నైరుతి’
- నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: వాతావరణం శరవేగంగా మారిపోతోంది. అనూహ్య పరిణామాలతో నైరుతి రుతుపవనాల రాకకు మార్గం సుగమమవుతోంది. శనివారం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని పది రోజులు ముందుగానే తాకవచ్చన్న విషయం స్పష్టమైంది. తాజాగా రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకడానికి అనుకూల పరిస్థితులున్నాయని భారత వాతావరణ విభాగం శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.
వాస్తవానికి మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్‌ను తాకుతాయి. ఆ తర్వాత పది రోజులకు అంటే జూన్ ఒకటికి కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన నాలుగైదు రోజుల ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకనున్నాయి. ఆతర్వాత వారం రోజుల్లోనే ఇవి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారనుంది. రెండ్రోజుల్లో(16 నాటికి) మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని ఐఎండీ పేర్కొంది. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు మరింత బలాన్ని సంతరించుకుంటాయని రిటైర్డు వాతావరణ అధికారి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.
తెలంగాణాలో వర్షాలు.. వడగాడ్పులు..
రాష్ట్రంలో రెండు రోజుల పాటు విచిత్రమైన పరిస్థితి ఏర్పడనుంది. ఒకవైపు వడగాడ్పులు, మరోవైపు అల్పపీడనంతో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంక తీరప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని వల్ల శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఈ రెండు రోజులు తీవ్రమైన వడగాడ్పులు కూడా వీస్తాయని హెచ్చరించింది. మధ్యాహ్నం వరకు వడగాడ్పులు, సాయంత్రాలు ఉరుములతో వర్షాలుంటాయని తెలిపింది.
ఇక శుక్రవారం రామగుండంలో అత్యధికంగా 45.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 44.3, నిజామాబాద్‌లో 43.7 డిగ్రీలు రికార్డయింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోనూ భానుడు ప్రతాపం చూపించాడు. కొద్దిరోజులపాటు చిరుజల్లులు, చల్లని గాలులతో ఉపశమనం పొందిన నగరవాసులకు మళ్లీ ఎండదెబ్బ తప్పడం లేదు. శుక్రవారం గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 28.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో సిటీజనులు విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తా, రాయలసీమల్లో వానలు..
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణిల ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమల్లోనూ పగటి పూట ఉష్ణోగ్రతలు ఒకింత అధికంగా నమోదైనా వడగాడ్పులు వీచే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోకెల్లా రామగుండంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయానికి) తునిలో 22.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. హార్సిలీహిల్స్ సమీపంలోని ఆరోగ్యవరంలో మినహా రాయలసీమలోని మిగి లిన ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 45.2
ఆదిలాబాద్ 44.3
నిజామాబాద్ 43.7
మెదక్ 42.4
ఖమ్మం 42.0
భద్రాచలం 41.6
హైదరాబాద్ 41.2
మహబూబ్‌నగర్ 40.5
అనంతపురం 42.7
కడప 41.2
తిరుపతి 41.2
విజయవాడ 41.0