పలకరించిన తొలకరి
- వివిధ మండలాల్లో భారీ వర్షాలు
- బండి ఆత్మకూరులో అత్యధికంగా 73.4 మిమీ నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): తొలకరి పలకరించింది. పుడమి పులకించింది. వివిధ మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 7.8 మిమీ వర్షపాతం నమోదైంది. 24 మండలాల్లో వర్షాలు పడటంతో పత్తి, ఉల్లి పంటలు సాగుకు రైతులు సిద్ధమయ్యారు. అత్యధికంగా బండిఆత్మకూరు మండలంలో 73.4 మిమీ వర్షపాతం నమోదు అయింది. వెలుగోడులో 54.8, కొలిమిగుండ్లలో 50.2, గడివేములలో 41.2, కొత్తపల్లిలో 36.4, పాములపాడులో 26.2, శిరువెళ్లలో 16.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మిమీ ఉండగా మొదటి ఆరు రోజుల్లో 10.3 మిమీ వర్షపాతం నమోదు అయింది. అయితే మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం డోన్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.