
కృష్ణ పట్టెలో సారాబట్టీ
మళ్లీ జోరందుకున్న సారా విక్రయాలు
ఆయకట్టు ఏరియాలో పేట్రేగిపోతున్న నల్లబెల్లం మాఫియా
ఐదు నెలల కాలంలో 381 సారా కేసులు
నల్లగొండ
జిల్లా వ్యాప్తంగా సారా విక్రయాలు మళ్లీ జోరందుకున్నాయి. ఎక్సైజ్ శాఖ, ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం వరుస దాడులతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నట్టు కనిపించిన సారా మాఫియా జూలువిదుల్చుకుంది. ఎక్సైజ్ అధికారులు ఐదుమాసాల నుంచి వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తున్న క్రమంలో సారా ఆనవాళ్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే భారీ స్థాయిలో సారా డంపులు బయటపడ్డాయి. జిల్లాలో నల్లబెల్లం మాఫియా, సారా తయారీ నామరూపాలు లేకుండా పోయాయని నిర్ధారణకు వచ్చిన తరుణంలో సారా సంఘటనలు పునారావృతకావడం ఎక్సైజ్ శాఖకు పెద్ద సవాల్‌గా పరిణమించింది. ఈ నెల 12 నుంచి కృష్ణాపుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సారా విక్రయాలు ఎక్సైజ్ శాఖను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. మద్యం దుకాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని అధికారులు స్పష్టం చేస్తున్నా...బెల్టు దుకాణాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్తున్నారు. ఇందుకోసం నల్లగొండ జిల్లా పోలీసులతో పాటు, పొరుగు జిల్లాల నుంచి అదనపు ఎక్సైజ్ బలగాలను రంగంలోకి దింపుతున్నా రు. పుష్కర ఘాట్ల వద్ద పకడ్బందీ బందోబస్తుతో పాటు కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సారా విక్రయాలకు మళ్లీ జీవం...
ఎక్సైజ్ అధికారులు నిద్రావస్థలోకి జారుకోవడంతోనే సారా విక్రయాలు ఊపందుకున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 381 సారా కేసులు నమోదయ్యాయి. దీంట్లో నల్లగొండ ఎక్సైజ్‌సూపరింటెంటెండ్ పరిధిలో 82...మిర్యాలగూడ ఈఎస్ పరిధిలోనే 299 కేసులు నమోదు కావడం గమనార్హం. అది కూడా ప్రస్తుతం పుష్కరాలు జరగబోయే ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 17,675 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకోగా...1318 లీటర్ల సారాను సీజ్ చేశారు. 13,125 లీటర్ల వాష్‌ను ధ్వంసం చేశారు. 14 వాహనాలు సీజ్ చేయగా, ఆరుగురుని అరెస్ట్ చేశారు.
ఘాట్ల పరిధిలోకి వచ్చే స్టేషన్లలోనే...
పుష్కరాలకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న మట్టపల్లి, దామరచర్ల, నేరేడుచర్ల, పెద్దవూర, మేళ్లచెర్వు, చందంపేట, పీఏపల్లి మండలాల పరిధిలోకి వచ్చే ఎక్సైజ్ స్టేషన్లలోనే సారా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు నమోదైన సారా కేసులను స్టేషన్‌ల (ఎస్‌హెచ్‌ఓ) వారీగా పరిశీలిస్తే...మిర్యాలగూడ–15, హుజూర్‌నగర్–51, కోదాడ–45, హాలియా–16, దేవరకొండ–57, నాంపల్లి స్టేషన్‌లో ఐదు కేసులు నమోదుకాగా...ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్–69, ఎన్‌ఫోర్స్‌మెంట్–41 కేసులు కలిపి మొత్తం 299 కేసులు నమోదు చేశారు. అదే నల్లగొండ ఈఎస్ పరిధిలో 82 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేటలో 23, అత్యల్పంగా మోత్కూరులో రెండు కేసులు నమోదు చేశారు.
పుష్కరాల వద్ద ఎక్సైజ్ నిఘా...
పుష్కరాల ఘాట్ల సమీపంలో బెల్టు దుకాణాలు, సారా విక్రయాలు, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిరాకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పోలీసులు, పొరుగు జిల్లాల వారితో కలుపుకుని ఎస్‌ఐలు 92 మంది, కానిస్టేబుళ్లు 208 మందిని నియమించనున్నారు. వీరిలో పొరుగు జిల్లాల నుంచి వచ్చే ఎస్‌ఐలు 30 మంది, కానిస్టేబుళ్లు 118 మంది ఉన్నారు. నల్లగొండ ఈఎస్ పరిధిలో 3 ఘాట్ల వద్ద 24 మంది ఎస్‌ఐలు, 33 మంది కానిస్టేబుల్స్‌ను నియమించాలని నిర్ణయించారు. మిర్యాలగూడ ఈఎస్ పరిధిలో 25 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ ఎస్‌ఐలు 68, కానిస్టేబుల్స్ 175 మందిని ని యమించనున్నారు. ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగానికి ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, కంట్రోల్ రూం విభాగంలోఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. ¿¶ క్తులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కంట్రోల్ రూం అధికారులు నమోదు చేస్తారు. ఈ కార్యాలయం 24 గంటల పాటు పనిచేస్తుంది.
చెక్‌పోస్టులు...
పానగల్లు, దర్వేశిపురం వద్ద ఒకటి, పెద్దమునిగల్, వాడపల్లి, అడవి దేవుల పల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి పుష్కరాలకు వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమంగా మద్యం తరలిరాకుండా, కల్తీ మద్యం ప్రవేశి ంచకుండా ఉ ండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.