స్వాధీనం చేసుకున్న సొత్తును చూపిస్తున్న పోలీసులు
చాంద్రాయణగుట్ట: పీడీ యాక్ట్‌కు నమోదు చేసి జైలుకు పంపినా.. లెక్క చేయకుండా మళ్లీ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను మాదన్నపేట పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 15,77,900ల విలువజేసే 50.90 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలానికి చెందిన ఉషాల యాదులు అలియాస్ యాది (33) మాదన్నపేట కుర్మగూడలో నివాసం ఉంటున్నాడు. 17 ఏళ్ల వయసప్పుడే తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలు మొదలెట్టాడు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని బోయిన్‌పల్లిలో–9, సీసీఎస్‌లో–4, కార్ఖానాలో–1, మొఘల్‌పురాలో–1, సైదాబాద్‌లో–4, నారాయణగూడలో–2, మలక్‌పేటలో–2, చిక్కడపల్లిలో–1, వనస్థలిపురం, జీడిమెట్ల, అల్వాల్, మాదాపూర్, కుషాయిగూడలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 29 చోరీలు చేశాడు. దీంతో ఇతనిపై గతేడాది మార్చిలో పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన యాదులు మళ్లీ తన పాత పంథాలోనే పయనిస్తున్నాడు. కాగా, చోరీ చేసిన నాలుగు తులాల బంగారు గొలుసును మాదన్నపేట భరత్‌నగర్‌లో విక్రయించేందుకు యత్నిస్తుండగా ఏఎస్సై దానయ్య, కానిస్టేబుళ్లు మౌసిన్, సి.శ్రీనివాసు కలిసి యాదులును అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు ఈ గొలుసు స్థానికంగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు మరింత లోతుగా విచారించగా కేవలం నాలుగు నెలల వ్యవధిలో సంతోష్‌నగర్ డివిజన్‌లోనే ఎనిమిది ఇళ్లల్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. పీడీ యాక్ట్‌ల నమోదుతో కరుడుగట్టిన రౌడీషీటర్లే సత్ప్రవర్తనతో మెలుగుతున్నారని....కాని యాదులు మాత్రం తిరిగి అదే దారిలో పయనించాడని డీసీపీ తెలిపారు. ఇతనిపై మరోసారి పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబూరావు, సంతోష్‌నగర్ ఏసీపీ వి.శ్రీనివాసులు, మాదన్నపేట ఇన్‌స్పెక్టర్ కేపీవీ రాజు తదితరులు పాల్గొన్నారు.