బిడ్డకు జన్మనిచ్చి.. కన్ను మూసిన తల్లి
జనగామ: బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. పండంటి బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించిన విషాద ఘటన వరంగల్ జిల్లా జనగామలో గురువారం చోటు చేసుకుంది. పిండంలో గడ్డకట్టిన రక్తంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్న మహిళ బిడ్డను చూసుకోకుండానే కన్నుమూసింది. నర్మెట మండల కేంద్రానికి చెందిన శెనావతుల ముత్యం తన భార్య రజిత (32), కుటుంబ సభ్యులతో కలసి 15 ఏళ్ల క్రితం జనగామకు వచ్చారు. సిద్దిపేట రహదారి పక్కన గుడారం వేసుకుని ప్లాస్టిక్ వస్తువులను అమ్ముకుంటూ బతుకుతున్నారు. రజితకు ఇద్దరు కూతుళ్లు కాగా, కొడుకు కోసం ఎదురు చూసింది.
మూడో కాన్పులో బుధవారం రాత్రి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పిం డంలో రక్తం గడ్డకట్టి ఉందని, తల్లి ప్రాణానికి ముప్పు అని చెప్పారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున కూతురుకు జన్మనిచ్చిన రజిత.. ఆ చిన్నారిని చూడకుండానే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, ఆమె కూతుళ్లు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సొంత ఇల్లు లేకపోవడంతో రజిత మృతదేహాన్ని రహదారి పక్కనే ఉంచారు. ప్రభుత్వం ఈ నిరుపేద కుటుంబానికి సాయం అం దించాలని, తల్లిలేని ముగ్గురు కూతుళ్ల భవిష్యత్తుకు అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.