తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం
నల్లగొండ టౌన్: తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని తల్లిపాలతోనే చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. మంగళవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నిర్వహించిన ర్యాలీని ఆయన జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలను విధిగా పట్టించాలన్నారు. ముర్రుపాలలో రోగనిరోధక శక్తి ఉంటుందని, తల్లిపాలు చిన్నారుల ఆరోగ్యాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ దామెర యాదయ్య మాట్లాడుతూ చిన్నారులకు పుట్టినప్పటి నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలనే తాగించాలన్నారు. డబ్బాపాల వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.నర్సింగరావు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ సుచరిత, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ రాజేశ్వరీ, డాక్టర్ జిలానీ, డాక్టర్ సుధాకర్, డాక్టర్ లీలావతి, సిద్ధార్థ, దీప్తి నర్సింగ్ కళా«శాలల విద్యార్థినులు పాల్గొన్నారు.