జల్సాల కోసం చోరీల బాట
జల్సాల కోసం చోరీల బాట
Published Sat, May 6 2017 11:48 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
మోటారు బైక్‌ల దొంగలు అరెస్టు
రూ.3.60 లక్షల విలువైన బైక్‌లు స్వాధీనం
కాకినాడ క్రైం : వారంతా యువకులు.. చదువు అబ్బకపోవడంతో బలాదూర్‌గా తిరుగుతూ, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కాకినాడ సిటీ పరి«ధిలో ఇటీవల మోటారు బైక్‌ల వరుస మాయం సంఘటనలపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.3.60 లక్షల విలువైన 14 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం కాకినాడ త్రీటౌన్ క్రైం పోలీస్ స్టేçషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకినాడ క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు నిందితుల వివరాలను వెల్లడించారు. సామర్లకోట మండలం మాధవపట్నం అంబేడ్కర్ కాలనీకి చెందిన 19 ఏళ్ల బొలిపే రాజబాబు (రాజు), ఇదే కాలనీకి చెందిన బారిక వెంకటరమణలు పాత నేరస్తులు. వీరు గతంలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పెదపూడి మండలం కరకుదురు గ్రామానికి చెందిన బొంతు సూరిబాబు (సురేష్), ఒక మైనర్ బాలుడు కలసి మూడు నెలలుగా కాకినాడ వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మోటార్ బైక్‌లను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మోటార్ బైక్‌ల దొంగతనాలపై ఏఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షణలో తన ఆధ్వర్యంలో త్రీటౌన్ క్రైం ఎస్సై ఎస్‌ఎం.పాషా, క్రైం పార్టీ ఆధ్వర్యంలో మూడు నెలలుగా దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.
నలుగురు నిందితుల్లో ఇద్దరు పాత వారే..
కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చోరీల పర్వం వెలుగుచూసింది. వీరి వద్ద నుంచి రూ.2.10 లక్షల విలువ చేసే 4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా కాకినాడ టూటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు మోటారు బైక్‌లు చోరీకి గురయ్యాయి. వీటిని కాకినాడ రాజీవ్ గృహకల్ప వద్ద, డైరీఫారం సెంటర్‌లో చవ్వాకుల దుర్గాప్రసాద్ వద్ద నుంచి క్రైం ఎస్సై రామారావు అరెస్టు చేసి, రూ.1.50 లక్షల విలువ చేసే 5 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను శనివారం అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్టు తెలిపారు. బాలుడిని జువైనల్ యాక్టు ప్రకారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో క్రైం ఎస్సైలు ఎస్‌ఎం పాషా, హరీష్‌కుమార్, రామారావు, క్రైం పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement