- సామర్థ్య ధ్రువపత్రం లేని 215 బస్సులు
- డొక్కు బస్సుల్లోనే విద్యార్థుల తరలింపు
- పట్టించుకోని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు
విజయనగరం : భారీగా ఫీజులు వసూలు చేయడంపై ప్రైవేటు విద్యాసంస్థలు చూపుతున్న శ్రద్ధ విద్యార్థుల భద్రతపై పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డొక్కు బస్సుల్లోనే విద్యార్థులను తరలిస్తున్నా, వారి భద్రతకు ముప్పు ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికల్లా తమ బస్సులకు సామర్థ్య పరీక్ష చేయించుకోవలసిన యాజమాన్యాలు ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చర్యలు చేపట్టాల్సిన రవాణ శాఖాధికారులు ఏకారణం వల్లో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులపై కన్నెత్తి చూడటం లేదు.
జిల్లాలో 509 ప్రైవేటు స్కూల్, కళాశాలల బస్సులున్నాయి. వీటిలో ఇంతవరకు 294 బస్సులు మాత్రమే సామర్థ్య పరీక్ష చేయించుకోగా 215 బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికల్లా సామర్థ్య పరీక్ష చేయించుకోని బస్సులు రోడ్కెక్కేందుకు వీల్లేదు. కానీ సోమవారం అత్యధిక ప్రైవేటు పాఠశాలలు డొక్కు బస్సుల్లోనే విద్యార్థులను తరలించాయి. గత ఏడాది సామర్థ్యం లేని పాఠశాల బస్సులపై రవాణ శాఖాధికారులు కేసులు నమోదు చేసారు. ఈ ఏడాది మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు.
సామర్థ్య పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం పొందకుండా తిరుగుతున్న వాహనాలపై మంగళవారం నుంచి దాడులు చేస్తాం. అలాంటి వాటిని సీజ్ చేస్తాం.
- ప్రవీణ్‌కుమార్, వెహికల్ ఇన్‌స్పెక్టర్