motor vehicle Inspectors
-
TS: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ప్రకటన లేకుండా ఉద్యోగ అర్హత నిబంధనల్లో మార్పులు చేయటం మహిళా అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఉద్యోగం రావటం, రాకపోవటం సంగతి అటుంచితే కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేని స్థితి ఏర్పడింది. అయితే, రవాణాశాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) 113 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్–1లో 54, మల్టీజోన్–2లో 59 పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. వీటిలో మహిళలకు 41 పోస్టులు రిజర్వ్ చేసింది. మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ, లేదా తత్సమాన విద్యార్హత, మూడేళ్ల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమాలను విద్యార్హతలుగా ఖరారు చేసింది. ఈనెల 5 నుంచి సెప్టెంబరు ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది. నోటిఫికేషన్ వెలువడ్డ తేదీ నాటికి మహిళా అభ్యర్థులు కూడా కచ్చితంగా హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉండాలని నిబంధన విధించింది. ఇక్కడే చిక్కొచ్చి పడింది. గతంలో ఈ పోస్టుకు ఈ నిబంధన లేదు. మహిళలకు మినహాయింపు ఉండటంతో చాలామంది ఆ లైసెన్సు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు వారెవరూ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు లైసెన్సు తీసుకుని ఉండేలా నిబంధన మార్చాలని మహిళా అభ్యర్థులు కోరుతున్నారు. ఆ లైసెన్సు తీసుకోవటానికి తగు సమయం ఇవ్వాలని, తరువాతే దరఖాస్తులు ఆహ్వానించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో, ఆ మేరకు సడలింపు ఇస్తే బాగుంటుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దానికి సానుకూలంగా నిబంధన మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇది కూడా చదవండి: బల్దియాపై పిడుగు -
ప్రైవేటు బస్సా.. ఐతే ఓకే
సామర్థ్య ధ్రువపత్రం లేని 215 బస్సులు డొక్కు బస్సుల్లోనే విద్యార్థుల తరలింపు పట్టించుకోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విజయనగరం : భారీగా ఫీజులు వసూలు చేయడంపై ప్రైవేటు విద్యాసంస్థలు చూపుతున్న శ్రద్ధ విద్యార్థుల భద్రతపై పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డొక్కు బస్సుల్లోనే విద్యార్థులను తరలిస్తున్నా, వారి భద్రతకు ముప్పు ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికల్లా తమ బస్సులకు సామర్థ్య పరీక్ష చేయించుకోవలసిన యాజమాన్యాలు ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చర్యలు చేపట్టాల్సిన రవాణ శాఖాధికారులు ఏకారణం వల్లో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులపై కన్నెత్తి చూడటం లేదు. జిల్లాలో 509 ప్రైవేటు స్కూల్, కళాశాలల బస్సులున్నాయి. వీటిలో ఇంతవరకు 294 బస్సులు మాత్రమే సామర్థ్య పరీక్ష చేయించుకోగా 215 బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికల్లా సామర్థ్య పరీక్ష చేయించుకోని బస్సులు రోడ్కెక్కేందుకు వీల్లేదు. కానీ సోమవారం అత్యధిక ప్రైవేటు పాఠశాలలు డొక్కు బస్సుల్లోనే విద్యార్థులను తరలించాయి. గత ఏడాది సామర్థ్యం లేని పాఠశాల బస్సులపై రవాణ శాఖాధికారులు కేసులు నమోదు చేసారు. ఈ ఏడాది మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. సామర్థ్య పరీక్షలు చేయించుకుని ధ్రువపత్రం పొందకుండా తిరుగుతున్న వాహనాలపై మంగళవారం నుంచి దాడులు చేస్తాం. అలాంటి వాటిని సీజ్ చేస్తాం. - ప్రవీణ్‌కుమార్, వెహికల్ ఇన్స్పెక్టర్ -
సీనియారిటీ జాబితా ఏది?
రవాణా శాఖలో డీపీసీ హడావుడి భేటీపై సిబ్బంది ఆందోళన సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో మోటారు వాహనాల ఇన్స్పెక్టర్లకు ప్రాంతీయ రవాణా అధికారులుగా పదోన్నతులు కల్పించేందుకు సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) భేటీ కానుంది. అయితే దీనికి సంబంధించి కొత్తగా సీనియారిటీ జాబితా రూపొందించకుండానే హడావుడిగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఆ విభాగం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో రెండేళ్ల కింద రూపొందించిన జాబితా ప్రామాణికంగా పదోన్నతులు ఇస్తే పదోన్నతులు పొందే వీలున్న పలువురికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా సీనియారిటీ జాబితా రూపొందించిన తర్వాతే పదోన్నతులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
చెక్‌పోస్టుల్లో ఈ పోస్టు మరీ ఖరీదు!
ఎంవీఐగా బదిలీకి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణ రవాణా మంత్రి, ఉన్నతాధికారుల పేరిట వసూళ్లు ఆరోపణలున్నా సీఎం ఆమోదముద్ర సాక్షి, హైదరాబాద్: రవాణా చెక్‌పోస్టుల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), అసిస్టెంట్ ఎంవీఐ పోస్టింగ్‌ల కోసం భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోలేదు. 8 మంది ఎంవీఐ, 20 మంది ఏఎంవీఐలను చెక్‌పోస్టుల్లో నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బదిలీకి రూ. 20 లక్షలు ఉద్యోగుల నుంచి వసూలు చేశారని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయన్న సంగతి విదితమే. పదోన్నతులతో,.. చెక్‌పోస్టుల్లో ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులు దాదాపు 28ఖాళీలు ఏర్పడ్డాయి. ఆదాయం ఆర్జనకూ అవకాశం ఉన్నందున ఈ పోస్టులకు భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా రవాణా శాఖలోని కొంత మంది దళారుల అవతారం ఎత్తారు. రాష్ట్ర రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, కొంతమంది ఉన్నతాధికారుల పేరిట పోస్టింగ్‌లు కోరేవారినుంచి భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రమోషన్లు జరిగిన వెంటనే అధికారులు రూపొందించిన బదిలీల జాబితాను రద్దు చేసి, సొమ్ము ఇచ్చిన ఆశావహులతో బదిలీల జాబితా రూపొందించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కూడా, ఇదే జాబితాకు ఆమోదం తెలిపినట్లు రవాణా శాఖ కమిషనరేట్‌లో చెప్పుకొంటున్నారు. -
అధికారుల జబర్దస్తీ
తిమ్మాపూర్, న్యూస్‌లైన్: పౌర సరఫరాల సరుకులను రేషన్ షాపుల్లోకి తరలించడానికి వాహనదారులపై అధికారులు జబర్దస్తీ చేస్తున్నారు. సరుకులను సకాలంలో రేషన్‌షాపులకు తరలించాలని జాయింట్ కలెక్టర్ ఇటీవల ఆర్డీవోలకు, సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెలాఖరులోగా బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు రేషన్ షాపులకు రవాణా అయితే ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా అవుతాయనేది ముఖ్య ఉద్దేశం. లక్ష్య సాధన కోసం, ఉన్నతాధికారుల మెప్పు పొందాలని అధికారులు నిబంధనలకు పాతరేస్తున్నారు. గోడౌన్ నుంచి షాపులకు సరుకుల రవాణా కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు(ఎంవీఐలు) రోడ్డుపైకి వచ్చి వాహనాలను తనిఖీ చేస్తూ పత్రాలను తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని బలవంతంగా పౌరసరఫరాల సరుకుల రవాణాకు మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులున్నా ఏమీ చేసే పరిస్థితి లేక అధికారులకు భయపడి వాహనాలను పెడ్తున్నారు. ఇందులో కూలీలు బలైపోతున్నారు. ఎంవీఐలు లారీలు, వ్యాన్లను ఆపుతూ సరుకులు రవాణా చేసి వస్తేనే వదులుతామని ఒత్తిడి తీసుకొచ్చి పత్రాలను తీసుకుంటున్నాని డ్రైవర్లు చెబుతున్నారు. తమ బాధలు చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోతున్నారు. తాము కొన్ని కిరాయిలు మాట్లాడుకుని మాట ఇచ్చి సమయానికి వెళ్లలేకపోతున్నామని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, వ్యాన్లను పట్టుకుంటున్నారని తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి వెళ్తున్న బూడిద లారీని పట్టుకుని అల్గునూర్ గోడౌన్‌కు తరలించారు. అయితే తినడానికి ఉపయోగించే బియ్యం, చక్కెర, ఇతర సరుకులను తరలించడానికి బూడిద లారీని ఉపయోగించారు. బూడిద రవాణా కోసం వచ్చిన ఒరిస్సా కూలీలు తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు కూలి వృథా అవుతుందని వాపోయారు. లారీలు లోడింగ్ ఆలస్యం కావడంతో గంటల తరబడి గోడౌన్లోనే పడిగాపులు కాస్తున్నామని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. లోడింగ్, అన్లోడింగ్ సమస్యతో ఒక రోజు వృథా అవుతుండగా, కిరాయి గిట్టుబాటు కావడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి నెలాఖరున పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా వాహనదారులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని లారీలు, వ్యాన్ల డ్రైవర్లు కోరుతున్నారు.