తిమ్మాపూర్, న్యూస్‌లైన్: పౌర సరఫరాల సరుకులను రేషన్ షాపుల్లోకి తరలించడానికి వాహనదారులపై అధికారులు జబర్దస్తీ చేస్తున్నారు. సరుకులను సకాలంలో రేషన్‌షాపులకు తరలించాలని జాయింట్ కలెక్టర్ ఇటీవల ఆర్డీవోలకు, సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెలాఖరులోగా బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు రేషన్ షాపులకు రవాణా అయితే ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా అవుతాయనేది ముఖ్య ఉద్దేశం. లక్ష్య సాధన కోసం, ఉన్నతాధికారుల మెప్పు పొందాలని అధికారులు నిబంధనలకు పాతరేస్తున్నారు. గోడౌన్ నుంచి షాపులకు సరుకుల రవాణా కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మెటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లు(ఎంవీఐలు) రోడ్డుపైకి వచ్చి వాహనాలను తనిఖీ చేస్తూ పత్రాలను తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని బలవంతంగా పౌరసరఫరాల సరుకుల రవాణాకు మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులున్నా ఏమీ చేసే పరిస్థితి లేక అధికారులకు భయపడి వాహనాలను పెడ్తున్నారు. ఇందులో కూలీలు బలైపోతున్నారు. ఎంవీఐలు లారీలు, వ్యాన్లను ఆపుతూ సరుకులు రవాణా చేసి వస్తేనే వదులుతామని ఒత్తిడి తీసుకొచ్చి పత్రాలను తీసుకుంటున్నాని డ్రైవర్లు చెబుతున్నారు. తమ బాధలు చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోతున్నారు. తాము కొన్ని కిరాయిలు మాట్లాడుకుని మాట ఇచ్చి సమయానికి వెళ్లలేకపోతున్నామని చెప్పారు.
దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, వ్యాన్లను పట్టుకుంటున్నారని తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి వెళ్తున్న బూడిద లారీని పట్టుకుని అల్గునూర్ గోడౌన్‌కు తరలించారు. అయితే తినడానికి ఉపయోగించే బియ్యం, చక్కెర, ఇతర సరుకులను తరలించడానికి బూడిద లారీని ఉపయోగించారు. బూడిద రవాణా కోసం వచ్చిన ఒరిస్సా కూలీలు తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు కూలి వృథా అవుతుందని వాపోయారు. లారీలు లోడింగ్ ఆలస్యం కావడంతో గంటల తరబడి గోడౌన్‌లోనే పడిగాపులు కాస్తున్నామని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. లోడింగ్, అన్‌లోడింగ్ సమస్యతో ఒక రోజు వృథా అవుతుండగా, కిరాయి గిట్టుబాటు కావడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి నెలాఖరున పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా వాహనదారులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని లారీలు, వ్యాన్ల డ్రైవర్లు కోరుతున్నారు.
అధికారుల జబర్దస్తీ
Published Fri, Aug 30 2013 6:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement