ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన.. | mp balka suman express anger over district officials | Sakshi
Sakshi News home page

ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..

Published Fri, Sep 18 2015 9:15 PM | Last Updated on Thu, Aug 9 2018 8:13 PM

ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన.. - Sakshi

ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..

- దళితుడినైనందుకే లెక్కచేయడం లేదా?
- కరీంనగర్ జిల్లా అదికారులపై యువ ఎంపీ మండిపాటు

కరీంనగర్:
'నేను ఈ జిల్లా ఎంపీనే. పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలోనే ఉంది. అయినా జిల్లాలో జరిగే చాలా కార్యక్రమాల గురించి నాకు సమాచారం ఇవ్వడం లేదు. మొన్న జాబ్‌మేళా జరిగితే పిలవనేలేదు. జిల్లాస్థాయి సమీక్షలకు సరైన సమాచారం లేదు. మొన్న కేంద్ర మంత్రి ఒకరు వచ్చిపోతే చెప్పలేదు. ఈరోజు కూడా మధ్యాహ్నం 2గంటలకు రమ్మని చెప్పి ముందే సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక అభివృద్ధి పనులపై సమాచారమే లేదు.

శిలాఫలకాలు పెడుతున్నచోట తాటికాయంత అక్షరాలతో ఇతరుల పేర్లు పెడుతూ, నా పేరును మాత్రం చివరన చేరుస్తున్నారు? అసలు ఎంపీ అనే పదానికి గౌరవం కూడా ఇవ్వరా? పేరు చివరన శర్మ, రావు, రెడ్డి అని తగిలించుకుంటనే పిలిచి గౌరవిస్తారా? నా పేరు పక్కన అవేమీ లేవని పిలవడం లేదా? అసలేట్లా కన్పిస్తున్నాం మీకు... పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీస్ ఇస్తే మీరంతా ఢిల్లీలో నిలబడాల్సి వస్తుంది... ఏమనుకుంటున్నారో... జాగ్రత్త' ఇదీ.. టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేశం.

శుక్రవారం కరీంనగర్ కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ పథకాలపై జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. తనను పట్టించుకోవడంలేదంటూ జిల్లా అధికారులపై మండిపడ్డారు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న తాను ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధగా ఉందని, అధికారుల తీరుకు నిరసనగా వాకౌట్ చేసి వెళ్దామని వచ్చానని,  కానీ మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌లను చూశాక ఆ పని చేయలేకపోతున్నానని దగ్ధస్వరంతో అన్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ డాక్టర్ నాగేంద్ర తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement