ఎంపీ ఇల్లు ముట్టడి
న్యాయం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్
భానుగుడి (కాకినాడ) : కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన కార్యక్రమాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంటిని ముట్టడించగా, సోమవారం కాకినాడలోని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఇంటిని ముట్టడించి, నిరసన తెలిపారు. ఎంపీని కలిసి తమ సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించడమా, వేతన సవరణ చేయడమా అన్న విషయాలను ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. ప్రభుత్వం సైతం దీనిపై సానుకూలంగా ఉందని, వారు సంయమనం పాటించాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా అ«ధ్యక్షుడు యార్లగడ్డ రాజాచౌదరి మాట్లాడుతూ కళాశాలల్లో పాఠాలు బోధించాల్సిన తమను రోడ్డెక్కెలా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇకనుంచి జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామన్నారు.