ఎందుకు అధికారికంగా జరపాలి?
‘విమోచనం’పై బీజేపీ నేతలను ప్రశ్నించిన ఎంపీ కవిత
నాగారం(నిజామాబాద్): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డిమాండ్ చేస్తున్నారని.. అసలు విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించాలో చెప్పాలని నిజామాబాద్ ఎంపీ కవిత ప్రశ్నించారు. టీఎన్జీవోస్ ఆవిర్భవించి 70 ఏళ్లు పూర్తయినందున నిజామాబాద్‌లో బుధవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం 1999లో కాకినాడలో బీజేపీ చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ ఎందుకు మార్చుకుందో చెప్పాలన్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకులు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడమంటే శ్రీకాంతాచారిలాంటి ఎంతోమంది విద్యార్థులు చేసిన త్యాగాన్ని, కేసీఆర్ చేసిన ఉద్యమాలనుంచి వెనక్కి వెళ్లిపోవడమేనన్నారు. అలాగే, ఉద్యోగుల సమస్యలు అన్నీ సీఎం కేసీఆర్‌కు తెలుసని, వాటిని ఆయన పరిష్కరిస్తారని కవిత పేర్కొన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు గురించి పార్లమెంట్‌లో మాట్లాడతానన్నారు. సీమాంధ్ర పాలకుల వల్లే ఆరో జోన్‌లో నిజామాబాద్, మెదక్ జిల్లాలు, ఐదో జోన్‌లో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, వీజీగౌడ్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హమీద్, జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ తదితరులు పాల్గొన్నారు.