- ఎంపీ తోటకు చేదు అనుభవాలు
- సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే సహాయ నిరాకరణ
- బుట్టదాఖలవుతున్న ఆయన సిఫారసులు
- నివ్వెరపోతున్న అనుచరులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా రాజకీయాల్లో అదృష్టవంతులెవరైనా ఉన్నారా అంటేæ అది కాకినాడ ఎంపీ తోట నరసింహం అని చెబుతారు. 15 ఏళ్ల క్రితం వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక.. అంచెలంచెలుగా పదవుల నిచ్చెన మెట్లు ఎక్కేశారు. డీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పదవులు పొందిన ఆయన ఇప్పుడు కాకినాడ ఎంపీగా ఉన్నారు. నరసింహం రాజకీయ వైభవమంతా ఆయన సోదరుడు, అప్పటి డీసీసీ అధ్యక్షుడు తోట వెంకటాచలం మరణానంతరం ఆయన వారసత్వంగా వచ్చినవే.
అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడి గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు అల్లుడిగా, ఆయన ఆశీస్సులతో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీ అయిన విషయం తెలిసిందే. ఇంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తోట.. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ప్రస్తుతం సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. పలు నియోజకవర్గాల్లో అయితే ఎంపీ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. అన్నవరం దేవస్థానం పాలక మండలి ఎంపిక వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
ఆయన సిఫారసు బుట్టదాఖలు
అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం పాలకవర్గాన్ని ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. మొదటి నుంచీ తనకు అత్యంత సన్నిహితుడు, బంధువు అయిన కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన తోట అయ్యన్న పేరును తోట నాలుగైదు నెలల కిందట సిఫారసు చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. మరోపక్క వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికై, టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. జగ్గంపేటకు చెందిన కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) పేరును సిఫారసు చేశారు. దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సిఫారసు చేసినవారికి పదవి ఇవ్వలేదనే వివాదానికి, ఎంపీ తోట అనుచరుడికి కూడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం తోడై.. చివరకు పాలకవర్గం ఏర్పాటు కోసం అప్పట్లో విడుదల చేసిన జీఓను రద్దు చేశారు.
అయితే, తాజాగా నియమించిన పాలకవర్గంలో కూడా ఎంపీ తోట సిఫారసుకు గడ్డిపోచంత విలువ కూడా ఇవ్వలేదు. ఎంపీ ప్రతిపాదించిన అయ్యన్నను కాదని, ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించిన కొండబాబుకు ప్రాతినిధ్యం కల్పించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్నవరం దేవస్థానం పాలకవర్గంలో కూడా తన సిఫారసుకు విలువ లేకుండా చేయడంతో.. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ డుమ్మా కొట్టారు. ఎంపీ సిఫారసు చేసినవారిని దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే.
ఇదే తోట గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గానికి చెందిన కరుటూరి శ్రీనివాస్‌ను పాలకవర్గ సభ్యుడిగా నియమించుకోగలిగారు. ఎంపీ ముద్రగడ పద్మనాభం హయాంలో కూడా అన్నవరం దేవస్థానం పాలకవర్గంలో ఆయన సిఫారసు మేరకు సభ్యుడిని నియమించారు. కానీ, తోట సిఫారసును మాత్రం తుంగలో తొక్కేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన నరసింహానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన వర్గీయులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం పాలకవర్గంలో సభ్యత్వం మాట దేవుడెరుగు.. ఎంపీ వర్గమని అంటేనే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమను అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
సొంత నియోజకవర్గంలోనూ అదే తంతు
సొంత నియోజకవర్గం జగ్గంపేటలో కూడా ఎంపీ వర్గాన్ని ఎమ్మెల్యే నెహ్రూ వర్గీయులు దూరం పెడుతున్నారు. ఎమ్మెల్యే వర్గం తమను కనీసం పార్టీ నేతలుగా కూడా చూడటం లేదని జగ్గంపేటలో తోట ముఖ్య అనుచరుడైన బండారు రాజా వంటి నేతలు చాలా గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలో నామినేషన్ పద్ధతిలో నీరు - చెట్టు పథకం కింద చేపడుతున్న అంతర్గత రహదారులు, ఉపాధి హామీ పథకం లింకేజితో ఇచ్చిన గ్రామీణ రహదారులు, పుంత రోడ్లు, చెరువు అభివృద్ధి పనులను ఏకపక్షంగా వారే ఎగురేసుకు పోతున్నారని అంటున్నారు.
ఇంకా పలుచోట్ల..
- పిఠాపురం నియోజకవర్గంలో కూడా తోటకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అక్కడి ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ వర్గం ఎంపీ తోట వర్గాన్ని పూర్తిగా దూరం చేసేసింది. అధికారిక, పార్టీ కార్యక్రమాలు వేటికీ కూడా ఎంపీ వర్గ నేతలను ఆహ్వానించడం లేదు. ఎంపీతో సఖ్యతగా ఉండటమే మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు చేసిన పాపమన్నట్టు.. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైస్ చైర్మన్ పిల్లి చిన్నాను ప్రోత్సహిస్తున్నారని ఎంపీ తోట వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేకు వెనుక ఉండి పని చేసిన కాపు సామాజికవర్గ నేతలు కొందరు గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) డైరెక్టర్ పదవి ఆశించారు. అందులో మెజార్టీ నేతలు తోట వెంట ఉన్నారని పక్కన పెట్టేశారని అంటున్నారు.
ఆ మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల అమలులో.. చివరకు పింఛన్లలో కూడా ఎంపీ వర్గాన్ని వివక్షకు గురి చేస్తున్నారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు కాపు రుణాల మంజూరులో కూడా అదే సామాజికవర్గానికి చెందిన చైర్మన్ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే వర్మ వర్గం ఏకపక్షంగా చేసుకుపోతోంది. ఈ వ్యవహారాన్ని పలువురు ఆ సామాజికవర్గ ముఖ్య నేతల వద్దకు తీసుకువెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- ఎంపీ తోట స్వగ్రామం జగ్గంపేట నియోజకవర్గమే అయినా నివాసం ఉంటున్నది మాత్రం కాకినాడ నగరంలోనే. అందునా కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి, మేయర్ స్థానం జనరల్ మహిళ అయితే ఎంపీ తోట భార్య, కిర్లంపూడి సర్పంచ్ వాణి పోటీ చేస్తారనే ప్రచారం పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో సిటీలో ఎమ్మెల్యే కొండబాబు వర్గం తోట వర్గీయులతో దూరం పాటిస్తోంది. సిటీలో చౌకధరల దుకాణాల కేటాయింపులో ఎంపీ సిఫారసు చేసినవారిని ఎమ్మెల్యే పక్కన పెట్టేశారన్న ప్రచారం ఉంది. అలాగే, ఎంపీతో సఖ్యతగా ఉంటున్నారన్న కారణంతో నున్న దొరబాబును టీడీపీ నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు పార్టీలో బలంగా ఉన్నాయి.
- ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురంతోపాటు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సైతం ఎంపీ వర్గానికి ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.