ఎంపీడీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ పేర్కొన్నారు.
లేపాక్షి / చిలమత్తూరు : ఎంపీడీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ పేర్కొన్నారు. గురువారం ఆయన లేపాక్షి, చిలమత్తూరు ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయా మండలాల ఎంపీడీఓలతో పలు అంశాలపై చర్చించారు. సిబ్బంది కొరత ఉందని ఎంపీడీఓలు ఆయన దష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన లేపాక్షిలో విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, ప్రహరీ ఏర్పాటుపై ప్రత్యేక దష్టి సారిస్తామన్నారు.
తాగునీరు, ప్రహరీ లేని పాఠశాలలను గుర్తించి మండల ఇంజనీర్లతో నివేదికను తయారు చేసి జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపి నిధులు మంజూరు కావడానికి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో పబ్లిక్ మరుగుదొడ్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీటీసీ సభ్యులు చిన్న ఓబన్న, నాగభూషణ, సర్పంచ్ నరసింహమూర్తి తదితరులు ఆయన వెంట ఉన్నారు.