chamansab
-
కౌంట్ డౌన్ !
– జిల్లా పరిషత్ చైర్మన్ మార్పుపై టీడీపీ సమన్వయ కమిటీలో చర్చ – ఒప్పందం మేరకు రెండున్నరేళ్ల తర్వాత పూల నాగరాజుకు కట్టబెట్టేందుకు పార్టీ నిర్ణయం! – మరో ఆర్నెల్లు పొడిగించాలని చమన్ విన్నపం..పూల నాగరాజుతోనూ సంప్రదింపులు – చమన్ విన్నపాన్ని పూర్తిగా పక్కనపెట్టిన పార్టీ నేతలు – ఒప్పందానికి కట్టుబడి జనవరి 5న తొలగిపోవాలంటున్న పలువురు ఎమ్మెల్యేలు (సాక్షిప్రతినిధి, అనంతపురం) దూదేకుల చమన్ సాహెబ్.. ఒకప్పుడు జిల్లా బహిష్కరణకు గురైన వ్యక్తి. ఇప్పుడు జిల్లా ప్రథమ పౌరుడు. జిల్లా పరిషత్‌లో అత్యధిక స్థానాలు టీడీపీకి దక్కడంతో ఆ పార్టీ నిర్ణయం మేరకు మొదటి రెండున్నరేళ్లు చమన్‌కు చైర్మన్‌గిరి దక్కింది. ఆయనకు ఇచ్చిన కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ క్రమంలో తనకు గతంలో ఇచ్చిన మాట మేరకు చైర్మన్‌గిరి కట్టబెట్టాలని గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో టీడీపీ అధిష్టానం ఈ అంశాన్ని పార్టీ జిల్లా ఇన్చార్జ్ కొల్లు రవీంద్రకు అప్పగించింది. ఈ క్రమంలో ఆయన జిల్లా సమన్వయ కమిటీతో శనివారం పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ చమన్ కూడా హాజరయ్యారు. టీడీపీ వర్గాల సమాచారం మేరకు సమావేశంలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. మొదట మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ ఒప్పందం మేరకు జెడ్పీ చైర్మన్ గడువు జనవరి 5తో ముగుస్తుందని, ఆ అంశంపై చర్చిస్తే బాగుంటుందని లేవనెత్తారు. దీనిపై జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి స్పందిస్తూ ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, కొద్దిరోజుల్లో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ టీడీపీ ఆఫీసులోకి వెళ్లి దూదేకులకు రాజకీయ ప్రాధాన్యం తక్కువగా ఉందని, చమన్‌ను తొలగించకూడదని కొల్లుకు వినతిపత్రం అందజేశారు. దీనిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తీవ్రంగా స్పందించారు.పార్టీ విధానపరమైన నిర్ణయాలను అంతా గౌరవించాలని, ఇది టీడీపీ అంతర్గత అంశమని, కాంగ్రెస్ పార్టీ పేరుతోనో, కులాల పేరుతోనో రాద్ధాంతం చేయడం ఏంటని మండిపడ్డారు. ఇదే విషయంలో కొల్లు రవీంద్రతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చమన్ సూచనతోనే దాదాగాంధీ వచ్చినట్లు తెలుస్తోందని, అలా చేయాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. చమన్‌కు మద్దతుగా ఎవ్వరూ లేరా? చమన్‌కు మరో ఆర్నెల్ల పాటు చైర్మన్‌గా కొనసాగాలని ఉంది. దీనిపై గట్టిగా మాట్లాడి పదవి పొడిగింపుపై సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని మంత్రి సునీతతో చెప్పినట్లు తెలుస్తోంది. పైకి సరే అంటూ లోపల మాత్రం 'మనకెందుకులే' అనే ధోరణిని సునీత ప్రదర్శిస్తోన్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పాయి. పార్టీలో ప్రస్తుతం సునీత వ్యతిరేక వర్గం బలంగా ఉంది. చమన్, మాజీ ఎమ్మెల్యే కందికుంట మినహా తక్కిన వారంతా ఆమెతో విభేదిస్తున్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి, ఎమ్మెల్సీ కేశవ్, జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి లాంటి నేతలు సునీత విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మద్దతు చమన్‌కు ఉందంటే, వ్యతిరేకవర్గం తప్పనిసరిగా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇది చమన్‌కు ప్రతికూలంగా మారుతోంది. సునీత అనుచరుడిగా ముద్రపడటంతో ఆయన్ను తప్పించాలని వ్యతిరేకవర్గం ఇప్పటికే పార్టీ అధిస్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనవరి 5న చమన్ రాజీనామా చేయడం అనివార్యమయ్యేలా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సునీత కూడా తన మాట చెల్లుబాటుకాని పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చమన్ కూడా పసిగట్టి సొంత ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ పంచాయితీని నేరుగా పూల నాగరాజుతోనే తెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగరాజు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తక్కిన రెండున్నరేళ్ల పాటు తానే చైర్మన్‌గా ఉంటానని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చుతో పాటు అదనంగా ఇస్తానని చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. ఇది సాధ్యం కాకపోతే ఆర్నెల్లపాటు ఉండేందుకు సమ్మతించాలని కోరనున్నారు. కానీ ఈ రెండు ప్రతిపాదనలకు పూల నాగరాజు ఒప్పుకునే పరిస్థితి కన్పించడం లేదు. బుగ్గకారులో తిరగాలనే కోరిక ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తీరదని, కాబట్టి చైర్మన్‌గిరి కావల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి చమన్ జనవరి 5న రాజీనామా చేయకతప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై చమన్ కూడా స్పష్టతతోనే ఉన్నారు. సునీత అనుచరుణ్ని కాబట్టే చాలామంది తనకు మద్దతుగా సంప్రదింపులు జరిపేందుకు విముఖత చూపుతున్నారనే భావనతో ఉన్నారు. మరోవైపు పరిటాల ముద్ర ఉంది కాబట్టే జెడ్పీచైర్మన్ గిరి తనకు దక్కిందనే భావన కూడా ఉంది. ఈ క్రమంలో పరిటాల కుటుంబం కోసం తాను కోల్పోయిన దానితో, పడిన ఇబ్బందులతో పోల్చితే జెడ్పీచైర్మన్ గిరీ చాలా తక్కువని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగింది, ఇక నుంచి పరిటాల ముద్ర నుంచి బయటపడి స్వతంత్రంగా నాయకుడిగా ఎదగడం మంచిదనే నిర్ణయానికి చమన్ వచ్చినట్లు సమాచారం. ఇదే జరిగితే రామగిరిలో పరిటాల కోటకు బీటలు వారినట్లే! -
మూడింటిపైనే చర్చ
అనంతపురం సిటీ : జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు తూతూమంత్రంగా జరిగాయి. ఏడు అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా..మూడింటితోనే ముగించేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో చైర్మన్ చమన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రామచంద్ర, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు. ముందుగా ఆర్థిక, ప్రణాళిక పనులు అనే అంశాలపై చర్చించారు. విద్య-వైద్యంపై సమావేశం సమయంలోనే చైర్మన్ చమన్ అక్కడి నుంచి జనచైతన్య యాత్రకు వెళ్లి పోయారు. దీంతో ఆ సమావేశం జరగలేదు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ సంక్షేమంపై అసలు చర్చే ప్రారంభించలేదు. సాంఘిక సంక్షేమంపై సమావేశానికి పుట్టపర్తి జెడ్పీటీసీ సభ్యురాలు యశోదబాయి గైర్హాజరు కావడంతో ఆ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ వ్యవహరించారు. ఇక వ్యవసాయంఽపై సమావేశానికి మడకశిర జెడ్పీటీసీ సభ్యురాలు సులోచనమ్మ గైర్హాజరు కావడంతో కోరం ఏర్పడలేదు. దీంతో ఈ సమావేశాన్ని రద్దు చేశారు. ఇదిలావుండగా.. స్థాయీ సంఘ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. సభ్యులకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధిలేదని పలువురు అంటున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించండి :పల్లె జిల్లాలో చాలా గ్రామాలు, చిన్న పట్టణాల్లో తాగు నీరు లేక జనం అల్లాడుతున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. చమన్ అధ్యక్షతన జరిగిన సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఎనిమిది నెలల పాటు జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు ఎదురయ్యే అవకాశముందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామానికి నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
నేత్రదానానికి 80 మంది సిద్ధం
బుక్కరాయసముద్రం : తమ తదనంతరం నేత్రదానం చేసేందుకు 80 మంది అంగీకారం తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కేవీకేలో శ్రీసాయి హెల్త్‌కేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన నమోదు శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్, అనంతపురం డిఎస్పీ మల్లికార్జున వర్మ, జెడ్పీటీసీ రామలింగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చమన్‌సాహెబ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వాలని సూచించారు. అనంతరం 80 మంది మరణానంతరం నేత్ర దానం చేస్తామని అంగీకార పత్రాన్ని నిర్వాహకులకు ఇచ్చారు. -
సిబ్బంది కొరత లేకుండా చూస్తాం
లేపాక్షి / చిలమత్తూరు : ఎంపీడీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ పేర్కొన్నారు. గురువారం ఆయన లేపాక్షి, చిలమత్తూరు ఎంపీడీఓ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయా మండలాల ఎంపీడీఓలతో పలు అంశాలపై చర్చించారు. సిబ్బంది కొరత ఉందని ఎంపీడీఓలు ఆయన దష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన లేపాక్షిలో విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, ప్రహరీ ఏర్పాటుపై ప్రత్యేక దష్టి సారిస్తామన్నారు. తాగునీరు, ప్రహరీ లేని పాఠశాలలను గుర్తించి మండల ఇంజనీర్లతో నివేదికను తయారు చేసి జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపి నిధులు మంజూరు కావడానికి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో పబ్లిక్ మరుగుదొడ్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ హనోక్, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీటీసీ సభ్యులు చిన్న ఓబన్న, నాగభూషణ, సర్పంచ్ నరసింహమూర్తి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
ఐదుగురికి పదోన్నతులు
అనంతపురం సిటీ: ఐదుగురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ చమన్ గురువారం అందజేశారు. పదోన్నతి పొందినవారిలో జూనియర్ అసిస్టెంట్లు సుకన్య, రవికుమార్, పద్మప్రియ, జయరామ్‌నాయక్ ఉన్నారు. హిందూపురం సబ్‌డివిజన్‌లోని అటెంటర్ రెడ్డెప్పకు టైపిస్ట్‌గా పదోన్నతి కల్పించారు. -
సమస్యలు పక్కదారి!
సాక్షి, అనంతపురం: సుదీర్ఘ విరామం తరువాత బుధవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష సభ్యులపై ఎదురుదాడికి దిగుతూ సమస్యలను పక్కదారి పట్టించారు. గడిచిన పదేళ్లలో చేసిన తప్పులంటూ గత ప్రభుత్వాన్ని నిందించమే ధ్యేయంగా సమావేశాన్ని కొనసాగించారు. జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, విప్ యామినీ బాల, ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్చాంద్ బాషా, బీకే పార్థసారధి, వరదాపురం సూరి, ఈరన్న, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శమంతకమణి, తిప్పేస్వామి, గేయానంద్ హాజరయ్యారు. అజెండాలో కేవలం నాలుగు అంశాలపై చర్చించి సమావేశం ముగించడంతో మెజార్టీ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఉపాధి కల్పన, యువజన సంక్షేమం, గృహ నిర్మాణం, నెడ్‌క్యాప్, పౌరసరఫరా లు, ఎపీఎ ంఐపీ, పశుసంవర్థకం, ఉద్యానవనం, తదితర ముఖ్యశాఖల అభివృద్ధి ఇత ర కార్యక్రమాలను సమావేశంలో పట్టించుకోలేదు. విద్యుత్ సరఫరా సరిగా లేక రైతాంగం తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటోంది. దీనిపై రైతులకు భరోసా కల్పించలేకపోయారు. జిల్లాలో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకరు వు పెట్టినా అధికారపక్షం సరైన సమాధానం చెప్పలేకపోయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలపై ఎదురుదాడి సెల్ప్‌ఫైనాన్స్ ప్రకారం రుణ మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం కొత్తగా సర్కులర్ జారీ చేసిందని, ఈ మేరకు ఎకరాకు బ్యాంకర్ ఇచ్చేది రూ. 11 వేల రుణమైతే ఎన్ని ఎకరాలకు ఎంత రుణాన్ని మాఫీ చేస్తారన్న విషయాన్ని స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ రాప్తాడు జెట్పీటీసీ సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. దీనికి సమాధానం చెప్పాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు రవీంద్రనాథ్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. ఆయన పలుమార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా బల ప్రదర్శనకు దిగారు. హంద్రీనీవాకు సంబంధించి రూ. 170 కోట్లు విడుదల చేస్తే మొదటి దశ పనులు పూర్తి అయ్యేవని, తద్వారా శ్రీశైలం డ్యాం నుంచి 3,800 క్యూసెక్కుల నీటిని పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రభుత్వం వంద కోట్లు మాత్రమే మంజూరు చేసిందని, ఈ నిధులు ఏ మూలకు సరిపోవని ఆయన సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, వరదాపురం సూరి సరైన సమాధానమివ్వకుండా కాంగ్రెస్ హయంలో రూ. 5,200 కోట్లు ఖర్చు చేసింది వాస్తవమేనని, అందులో సగం దిగమింగింది నిజమేనని అడ్డుగోలుగా మాట్లాడారు. కదిరి ప్రాంతంలో ఏవీఆర్ హంద్రీ-నీవా కాలువ పనులు నిలిచిపోయాయని, అటవీ ప్రాంతాల్లో భూసేకరణకు అడ్డంకులు ఏర్పడడంతో పనులు సాగడం లేదని సభ దృష్టికి తీసుకురాగా, దానికి హంద్రీ-నీవా ఎస్ఈ సమాధానం చెప్పబోతుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలి విషయాన్ని పక్కదారి పట్టించారు. బంగారు తాకట్టు రుణాలు, ట్రాక్టర్ రుణాలు వెంటనే చెల్లించాలని పలు చోట్ల బ్యాంకర్లు వేలం నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ భాషా, జెడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చి దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు. స్పందించిన కలెక్టర్ రైతుల ఇబ్బందుల దృష్ట్యా వాటిని తాత్కలికంగా వాయిదా వేస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షం సభ్యులు పదేపదే అడ్డు తగులుతూ చర్చ సాగకుండా చేశారు. ఎమ్మెల్యేలు వెనకుండి ఈ వ్యవహారాన్ని నడిపించడాన్ని పలువురు తప్పుపట్టారు.