నవంబర్‌లో ముచ్చుమర్రి నుంచి నీరు విడుదల
-సీఈ జలంధర్
పాతముచ్చుమర్రి (పగిడ్యాల): ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకెనాల్‌కు నవంబర్ నెల 15వ తేదీ నుంచి నీరు విడుదల చేస్తామని జలవనరుల శాఖ సీఈ జలంధర్ తెలిపారు. శుక్రవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనుల పురోభివృద్ధిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తాత్కాలిక సబ్‌స్టేషన్ పనులు పూర్తయిన వెంటనే కేసీ కాలువకు, హంద్రీనీవా కాలువకు ఏకకాలంలో నీటి విడుదల చేస్తామన్నారు. కేసీ కాలువకు అనుసంధానం ఉన్న నాలుగు పంప్‌ల పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. హంద్రీనీవా çసుజల స్రవంతి కాలువకు సంబంధించి 8 పంపుల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. మరో నాలుగు పంపులు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయినందున పనులు చేపట్టలేకపోయామన్నారు. కేసీ ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు పంప్‌ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి అప్రోచ్ చానెల్‌కు లైనింగ్ పనులు చేసేందుకు రూ. 1300 కోట్లకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. కార్యక్రమంలో సీఈ నారాయణస్వామి, ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, డీఈ ఆదిశేషారెడ్డి, ఏఈలు సాంబశివుడు, కిశోర్ తదితరులు ఉన్నారు.