తాటాకు చప్పుళ్లకు భయపడొద్దు
క్రమశిక్షణతో పాదయాత్రకు తరలిరండి
కాపులకు ముద్రగడ పిలుపు
కిర్లంపూడి (జగ్గంపేట) : పోలీసుల తాటాకు చప్పుళ్లకు భయపడవద్దని, ఈ నెల 26న చేపట్టనున్న ఛావో రేవో ఛలో అమరావతి పేరుతో నిర్వహించనున్న నిరవధిక పాదయాత్రకు కాపులు భారీగా తరలిరావాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామం నుంచి భారీ సంఖ్యలో మోటారుసైకిళ్లపై కాపులు తరలివచ్చి ముద్రగడ చేపట్టనున్న పాదయాత్రకు సంఘీభావం తెలపడమే కాకుండా పాదయాత్రలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారినుద్ధేశించి మాట్లాడుతూ పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమనండి .. కేసులకు భయపడే పనిలేదు , ఏది ఏమైనా ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు జాతికి ఇచ్చిన హామీలు సాధించుకుంటేనే కాపు జాతి భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ కాపు జాతి భవిష్యత్తు కోసం ఊపిరున్నంత వరకు పోరాడే వ్యక్తి ఒక్క ముద్రగడ పద్మనాభం ఒక్కరేనన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌతు స్వామి, తూము చినబాబు, చల్లా సత్యనారాయణ, తోట బాబు, గోకేడ సత్యనారాయణమూర్తి, మండపాక చలపతి, ఇబ్రహీంతో పాటు పోతులూరు గ్రామానికి చెందిన వాసిరెడ్డి నందబాబు, శెట్టి గంగబాబు, సిద్ధా దొరబాబు, చక్కపల్లి నాగేశ్వరరావు, పాలంకి సత్తిబాబు, చక్కపల్లి వెంకట్రావు, దేవారపు బాబూరావు, ఎలుగుబంటి బాబ్జి, శెట్టి చక్రరావు, పసుపులేటి కృష్ణ, చీకట్ల రామకృష్ణ, శ్రీపతి నాగేశ్వరరావు, భారీ సంఖ్యలో కాపు నాయకులు పాల్గొన్నారు.