ద్వంద్వ నీతి
ద్వంద్వ నీతి
Published Fri, Aug 4 2017 10:57 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
– ముద్రగడ పాదయాత్ర అనుమతి విషయంలో హైడ్రామా
– దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తామంటున్న హోంమంత్రి
– పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామంటున్న ఎస్పీ విశాల్ గున్నీ
– ఒకవైపు కవ్వింపు చర్యలు – మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు
– పంతానికి పోతున్న చంద్రబాబు
– ఉద్యమ స్ఫూర్తితో ముద్రగడ
– మధ్యలో నలిగిపోతున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
– దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని, దరఖాస్తు చేయకుండానే అనుమతి ఇవ్వమంటే ఎలా అని హోంమంత్రి చినరాజప్ప తనదైన ధోరణిలో తరుచూ వ్యాఖ్యానిస్తున్నారు.
– అనుమతి లేని పాదయాత్రను అడ్డుకుంటాం. అనుమతి కోరితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేస్తున్నారు.
– పాదయాత్ర చేయలేకే అనుమతి తీసుకోవడం లేదని హోంమంత్రి రాజప్పతో పాటు టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారు.
– పాదయాత్ర చేయగలనో లేదో అనుమతి ఇచ్చి చూడండని...పాదయాత్ర చేస్తే సదరు మంత్రులు రాజీనామా చేస్తారా అని ముద్రగడ సవాల్ విసిరితే స్పందించకుండా టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే ముద్రగడ పాదయాత్ర అనుమతి విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని స్పష్టమవుతోంది. ఒకవైపు మంత్రుల ద్వారా రెచ్చగొడుతోంది. మరోవైపు పోలీసులతో అడ్డుకుంటోంది. కవ్వింపు చర్యలతో వ్యూహాత్మకంగా నడుస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నాళ్లు పోరాడుతారో చూస్తాం...ఎంతవరకు ఉద్యమం చేస్తారో చూద్దాం అన్నట్టుగా హైడ్రామాను ప్రభుత్వం నడిపిస్తోంది. సుప్రీంకోర్డు మార్గదర్శకాలను చూపించి ప్రస్తుతం పాదయాత్రను పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. ఆ మార్గదర్శకాలు చూస్తే ముద్రగడ దరఖాస్తు చేసినా అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే, తుని ఘటన చూపించి శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని అనుమతికి ససేమిరా చెప్పక తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ చెబుతున్నారే తప్ప అనుమతి ఇస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఇదంతా చూస్తుంటే అనుమతి పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. ఎవరో ఒకరు వెనక్కి తగ్గడమో...సయోధ్య కుదరడమో జరగాలి. లేదంటే పాదయాత్ర ముందుకెళ్లేది లేదు. పట్టు వదలని విక్రమార్కుడిగా ముద్రగడ వెనక్కి తగ్గేది ఉండదు. పంతకానికి పోతున్న చంద్రబాబు, ఉద్యమస్ఫూర్తితో ఉన్న ముద్రగడ ఎక్కడా తగ్గేలా లేరు. ఇప్పడదే కొనసాగుతోంది.
ఇరకాటంలో పోలీసులు
దీనివల్ల పోలీసులు నలిగిపోతున్నారు. ఎప్పుడు అవకాశమిస్తే అప్పుడే నడుస్తాను...పోలీసులు ఎన్ని రోజులు ఉంటారో చూస్తాను... పాదయాత్ర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రకు ఎప్పుడు బయలు దేరినా అడ్డుకుంటాం...బందోబస్తు విషయంలో రాజీపడేది లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అటు ముద్రగడ, ఇటు ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన తిండి లేక...విశ్రాంతి తీసుకునేందుకు వసతి దొరకక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగం కదా ..ఎలాగైనా చేస్తారులే అన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తమకు ఇంకెన్నాళ్లీ కష్టాలని 15 రోజులుగా పడిగాపులు కాస్తున్న పోలీసులు లబోదిబోమంటున్నారు. రోడ్ల మీద ఎన్నాళ్లీ తిప్పలని గగ్గోలు పెడుతున్నారు.
Advertisement