padha
-
ద్వంద్వ నీతి
– ముద్రగడ పాదయాత్ర అనుమతి విషయంలో హైడ్రామా – దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తామంటున్న హోంమంత్రి – పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామంటున్న ఎస్పీ విశాల్ గున్నీ – ఒకవైపు కవ్వింపు చర్యలు – మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు – పంతానికి పోతున్న చంద్రబాబు – ఉద్యమ స్ఫూర్తితో ముద్రగడ – మధ్యలో నలిగిపోతున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : – దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామని, దరఖాస్తు చేయకుండానే అనుమతి ఇవ్వమంటే ఎలా అని హోంమంత్రి చినరాజప్ప తనదైన ధోరణిలో తరుచూ వ్యాఖ్యానిస్తున్నారు. – అనుమతి లేని పాదయాత్రను అడ్డుకుంటాం. అనుమతి కోరితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేస్తున్నారు. – పాదయాత్ర చేయలేకే అనుమతి తీసుకోవడం లేదని హోంమంత్రి రాజప్పతో పాటు టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారు. – పాదయాత్ర చేయగలనో లేదో అనుమతి ఇచ్చి చూడండని...పాదయాత్ర చేస్తే సదరు మంత్రులు రాజీనామా చేస్తారా అని ముద్రగడ సవాల్ విసిరితే స్పందించకుండా టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ముద్రగడ పాదయాత్ర అనుమతి విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని స్పష్టమవుతోంది. ఒకవైపు మంత్రుల ద్వారా రెచ్చగొడుతోంది. మరోవైపు పోలీసులతో అడ్డుకుంటోంది. కవ్వింపు చర్యలతో వ్యూహాత్మకంగా నడుస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నాళ్లు పోరాడుతారో చూస్తాం...ఎంతవరకు ఉద్యమం చేస్తారో చూద్దాం అన్నట్టుగా హైడ్రామాను ప్రభుత్వం నడిపిస్తోంది. సుప్రీంకోర్డు మార్గదర్శకాలను చూపించి ప్రస్తుతం పాదయాత్రను పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. ఆ మార్గదర్శకాలు చూస్తే ముద్రగడ దరఖాస్తు చేసినా అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే, తుని ఘటన చూపించి శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని అనుమతికి ససేమిరా చెప్పక తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అనుమతి కోసం దరఖాస్తు చేస్తే పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ చెబుతున్నారే తప్ప అనుమతి ఇస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఇదంతా చూస్తుంటే అనుమతి పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. ఎవరో ఒకరు వెనక్కి తగ్గడమో...సయోధ్య కుదరడమో జరగాలి. లేదంటే పాదయాత్ర ముందుకెళ్లేది లేదు. పట్టు వదలని విక్రమార్కుడిగా ముద్రగడ వెనక్కి తగ్గేది ఉండదు. పంతకానికి పోతున్న చంద్రబాబు, ఉద్యమస్ఫూర్తితో ఉన్న ముద్రగడ ఎక్కడా తగ్గేలా లేరు. ఇప్పడదే కొనసాగుతోంది. ఇరకాటంలో పోలీసులు దీనివల్ల పోలీసులు నలిగిపోతున్నారు. ఎప్పుడు అవకాశమిస్తే అప్పుడే నడుస్తాను...పోలీసులు ఎన్ని రోజులు ఉంటారో చూస్తాను... పాదయాత్ర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రకు ఎప్పుడు బయలు దేరినా అడ్డుకుంటాం...బందోబస్తు విషయంలో రాజీపడేది లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అటు ముద్రగడ, ఇటు ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన తిండి లేక...విశ్రాంతి తీసుకునేందుకు వసతి దొరకక అవస్థలు పడుతున్నారు. ఉద్యోగం కదా ..ఎలాగైనా చేస్తారులే అన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తమకు ఇంకెన్నాళ్లీ కష్టాలని 15 రోజులుగా పడిగాపులు కాస్తున్న పోలీసులు లబోదిబోమంటున్నారు. రోడ్ల మీద ఎన్నాళ్లీ తిప్పలని గగ్గోలు పెడుతున్నారు. -
కాపు ఉద్యమాన్ని అణచివేస్తే తిరుగుబాటు
– అభివృద్ధి పనులు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం – పోలీసులను రోడ్లు పాలు చేసి అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబునాయుడు – వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విమర్శ భ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరంలో గురువారం పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు విస్మరించిందని అన్నారు. పుష్కర కాలువ ఎత్తిపోతల పథకం ద్వారా 1.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తే రైతులు పంటలు పండించుకొని లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రైతులకు నీరు అందించే విషయం మర్చిపోయి కాపు ఉద్యమం అణచివేతపై దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు. కాపు ఉద్యమం పోలీసులతో అణచి వేసేందుకు పోలీసులను రోడ్డు పాలు చేశారని అన్నారు. వారి విధులు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అన్నిచోట్లా అవినీతి పెచ్చుమీరిందని అన్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీని తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎమ్మర్జన్సీని తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ, గ్రేటర్ రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం ఆయనను ప్రకాష్‌నగర్ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం పొడవునా 144 ,30 సెక్షన్ల అమలు చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి నాయుడు, అడబాల శ్రీను, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, మోర్త పవన్‌మూర్తి, గడుగుల సత్యనారాయణ, దొడ్డి వెంకటేష్, కొప్పిశెట్టి గాంధీ, యమన నారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. -
అడుగు పడనీయ లేదు
– రెండో రోజు ఇంటి నుంచి బయటకొచ్చిన ముద్రగడ – గేటు వద్దే నిలిపివేసిన పోలీసులు – వారం రోజులపాటు గృహ నిర్బంధం – ఎప్పుడు వెళ్లనిస్తే అప్పుడే వెళతానన్న ముద్రగడ – జిల్లాలో ముద్రగడకు మద్దతుగా మహిళల నిరసనలు – అణిచివేస్తున్న పోలీసులు – కొనసాగుతున్న చెక్‌పోస్టులు, పికెట్లు – కాపు నేతల వద్ద పోలీసుల కాపలా జిల్లాలో... 1336 మంది బైండోవర్ 256 మంది గృహ నిర్బంధం. వైఎస్సార్సీపీ కాపు నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజులు, గిరిజాల బాబులు ఎక్కడికి వెళ్లినా వారి వాహనాల్లోనే పోలీసులు వెన్నంటి నిఘా... తుని మండలం ఎస్.అన్నవరంలో ముద్రగడ పద్మనాభం వియ్యంకుడిని గురువారం పోలీసులు గృహ నిర్బంధించారు. చెక్‌పోస్టులు: 69 చెక్ పోస్టులు, 112 పికెట్లు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి పరిసర ప్రాంతాలు, ప్రత్తిపాడు, జగ్గంపేట జాతీయరహదారి, కోనసీమ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా వ్యాప్తంగా 7000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్రలో పోలీసులు రెండో రోజు కూడా అడుగు పడనీయ లేదు. బుధవారం ప్రకటించిన మేరకు ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో కలసి ఇంటి నుంచి ఉదయం 9 గంటలకు బయటకు రాగానే గేటు వద్దకు 9.6 గంటలకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధిచడం సరికాదని, కావాలంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడను ఆగస్టు 2వ తేదీ వరకు వారం రోజులపాటు గృహ నిర్భందిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు ఎప్పుడు వెళ్లనిస్తే అప్పుడే పాదయాత్రకు వెళతానని పేర్కొంటూ ముద్రగడ తన అనుచరులతో తిరిగి ఇంటిలోకి వెళ్లిపోయారు. మొదటి రోజు బుధవారంతో పోల్చుకుంటే గురువారం ఉదయం ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల బలగాల హడావుడి కాస్త తగ్గింది. ముద్రగడకు మద్దతుగా గ్రామంలో దకాణాలు వరుసగా రెండో రోజు కూడా వ్యాపారులు మూసివేశారు. ప్రభుత్వ తీరుపై మహిళల నిరసనలు... కాపు సామాజికవర్గంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా, ముద్రగడకు మద్దతుగా జిల్లాలో కాపు సామాజికవర్గంతోపాటు, బీసీలు ఆందోళనలు చేశారు. + కిర్లంపూడి సమీపంలోని రాజుపాలెంలో మహిళలు మెరుపు ఆందోళన చేశారు. తమ సామాజికవర్గం పట్ట ప్రభుత్వడం అవలంబిస్తున్న తీరుపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. రోడ్డును అరగంటసేపు దిగ్బంధించారు. కిర్లంపూడి నుంచి వెళ్లిన మహిళా పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. కిర్లంపూడిలో బీసీలు ముద్రగడకు మద్దతుగా ఏనుగుల సెంటర్ ప్రాంతంలో ధర్నా చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. + అమలాపురంలో కాపు జేఏసీ నేతలు నళ్లా విష్ణుమూర్తి, నల్లా పవన్‌ను కాపులపై èచంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తలకు మాస్క్‌లు, మెడకు ఉరితాళ్లు వేసుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మరో కాపు ఉద్యమ నేత దివంగత నల్లా సూర్యచంద్రరావు చిత్రాలను కాపు నేతలు తమ ముఖాలకు మాస్క్‌లుగా ధరించి నిరసన తెలిపారు. ఎస్.అన్నవరంలో కాపులు స్వాంత్రయ్య సమరయోధుల విగ్రహాలకు క్షీరాభిక్షేకాలు చేసి నిరసన తెలిపారు. + మలికిపురంలో ర్యాలీ చేస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపేటలో అంబేడ్కర్ విగ్రహానికి మండల కాపు జేఏసీ కన్వీనర్ చీకట్ల ప్రసాద్ ఆధ్వర్యంలో కాపు యువత వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ చర్యలకు నిరసనగా శుక్రవారం కొత్తపేటకు బంద్ పిలుపునిచ్చారు. ముద్రగడ పాదయాత్రపై ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీకి రాజీనామా చేస్తామని సలాది రామకృష్ణ హెచ్చరించారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్లో కాపు నాయకులు నిరసన తెలియజేసి, గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. కాపు నేతలపై పోలీసుల నిఘా... జిల్లాలో బుధవారం బైండోవర్ చేసిన 1336 మంది కాపులు, గృహ నిర్బంధించిన 256 మంది నేతలపై పోలీసుల నిఘా పెట్టారు. వారు తమ అనుచరులను నిరసనల వైపు ప్రోత్సహించకుండా కట్టడి చేశారు. వైఎస్సార్సీపీ కాపు నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజులు, గిరిజాల బాబులు ఎక్కడికి వెళ్లినా వారి వాహనాల్లోనే పోలీసులు వెన్నంటి ఉన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలో ముద్రగడ పద్మనాభం వియ్యంకుడిని గురువారం పోలీసులు గృహ నిర్బంధించారు. + పెద్దాపురం నియోజక కాపు జెఎసీ కన్వీనర్ మలకల చంటిబాబును పెద్దాపురంలో హౌస్ అరెస్టు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 69 చెక్ పోస్టులు, 112 పికెట్లు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి పరిసర ప్రాంతాలు, ప్రత్తిపాడు, జగ్గంపేట జాతీయరహదారి, కోనసీమ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా వ్యాప్తంగా 7000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ విశాల్ గున్ని కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవ్వరూ ప్రజలను ఆందోళనల వైపు ప్రోత్సహించకపోతే ప్రస్తుత పరిస్థితిని సడలించేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం
-
రాష్ట్రంలో నిరంకుశ పాలన
వైఎస్సార్సీపీకి చెందిన కాపునేతలపై అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ : రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మంగళవారం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతగా మారాడని జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు.ఎన్నికల్లో చంద్రబాబు కాపు కులస్తులను బీసీ జాబితాలో చేరుస్తానని , కాపు కులాల వారు అడకుండానే హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హమీని అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తుంటే దానిని అడ్డుకోవడం దారుణమన్నారు. హిట్లర్ మించి చంద్రబాబు పాలన ఉందని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభంతో ఫొటో దిగినా, ముద్రగడ ఫొటోతో ఫ్లెక్సీ వేసుకున్న వారిపై కూడా కేసులు పెట్టడడం సిగ్గుచేటన్నారు. కాపు కులస్తులను అన్ని విధాలా చంద్రబాబు పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఎలా చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే వైఎస్సార్సీపీకి చెందిన కాపు నేతలు, రైతులకు నోటీసులు ఇస్తూ, బైండోవర్ కేసులు పెడుతున్నారని, టీడీపీ చెందిన కాపు నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపు కులస్తులను ముద్రగడ పద్మనాభం పాదయాత్ర పేరుతో వేధిస్తున్నారని, కాపు కులస్తులు భయపడేది లేదన్నారు. కాపు కులస్తులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు బొరుసు బద్రి, తోరాటి శ్రీను, ఆరిబోలు చినబాబు, పాలం నాగవిష్ణు, యర్రంశెట్టి పొలారావు, వుల్లి ఘణ, దేవన దుర్గాప్రసాద్, చిక్కిరెడ్డి సురేష్, దేవన బాబీ, దోసపాటి దుర్గారావు, మారిశెట్టి అర్జునరావు , గుగ్గిలం భాను తదితరులున్నారు. -
ఒకే...ఒక్కరోజు...
♦ పాదయాత్రకు క్లైమాక్స్ ♦ వేడెక్కిన పరిణామాలు ♦ వెనక్కి తగ్గని ఇరువర్గాలు ♦ చావోరేవో తేల్చుకుంటామంటున్న కాపులు ♦ పాదయాత్ర జరగనిచ్చేది లేదంటున్న పోలీసులు ♦ త్రిశంకు స్వర్గంలో టీడీపీ కాపు నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో హైటెన్షన్ చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘చలో అమరావతి’ పాదయాత్రకు ఒక్క రోజు వ్యవధి ఉండటంతో ఉత్కంఠ నెలకుంది. అటు ప్రభుత్వం, ఇటు ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. కిర్లంపూడిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రపైనే చర్చ జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలంతా భయపడుతుంటే...టీడీపీ నేతల పరిస్థితి మరో రకంగా ఉంది. అడకత్తెరలో పోకచెక్కలా వారి పరిస్థితి తయారైంది. ఉద్యమానికి దూరంగా ఉంటే కాపు సామాజిక వర్గం దూరమవుతుందని గుబులు వెంటాడుతుండగా, పోరాటానికి దగ్గరైతే అధిష్టానం ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందేమోనని భయం పట్టుకుంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ముద్రగడ పాదయాత్ర ప్రారంభం కావల్సి ఉంది. కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యమ నాయకులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవడంతో పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అనుమతి లేని పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తుండగా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతామంటూ ముద్రగడ బృందం తేల్చి చెబుతోంది. తమకిది చావోరేవోలాంటిదని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేయడంతో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పోలీసులు కిర్లంపూడిని అన్ని వైపులా మోహరించారు. ముద్రగడ నివాసాన్ని దాదాపు తమ అదుపులోకి తీసుకున్నారు. చెక్‌పోస్టులు, అవుట్ పోస్టులతో రహదారులన్నీ నిఘా వలయంలో ఉన్నాయి. ఒకవైపు పోలీసుల కవాతు, మరోవైపు కాపుల సమరభేరీతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాయి. సెక్షన్ 144, సెక్షన్ 30తో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారు. కాపులున్న గ్రామాలనైతే దాదాపు దిగ్బంధం చేస్తున్నారు. ఏ ఒక్కర్నీ బయటికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర జరగనివ్వకూడదని పోలీసులు పక్కా పథకంతో ముందుకెళ్తున్నారు. ఆరు నూరైనా పాదయాత్ర చేస్తామంటూ జేఏసీ నాయకులు ధీటుగా స్పందించడంతో కిర్లంపూడిలో యుద్ధ వాతావరణం నెలకుంది. బైండోవర్, హెచ్చరికలు, నోటీసులు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. చట్టం తన పనిచేసుకు పోతుందనే ధోరణితో పోలీసులు అన్ని రకాల ఆంక్షలు పెడుతున్నారు. చావో రేవో తేల్చుకుంటామంటూనే బుధవారం పాదయాత్ర అడ్డుకుంటే...మరో రోజు ప్రారంభిస్తామని...తమదెలాగూ నిరవధిక పాదయాత్ర అని ముద్రగడతోపాటు జేఏసీ నాయకులు తేల్చి చెప్పడంతో పోలీసు వర్గాలు డైలామాలో పడ్డాయి. ఇరకాటంలో టీడీపీ నేతలు అందరి పరిస్థితి ఒకలా ఉంటే టీడీపీ కాపు నేతల పరిస్థితి మరో రకంగా ఉంది. జిల్లాలో కాపు ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. కాపు జాతి కోసం జరుగుతున్న పోరాటంగా నిలిచిపోయింది. కాపులెవరైనా ఉద్యమానికి సహకరించకపోతే ద్రోహులగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా సంక్లిష్ట పరిస్థితిని టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. అధినేత చంద్రబాబు కారణంగా టీడీపీ నేతలు కాపు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. పదవులు పోతాయని, చంద్రబాబు ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని జేఏసీ నేతలను పలుకరించడానికి కూడా భయపడుతున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఛీత్కరించుకుంటోంది. రిజర్వేషన్ కోసం పోరాడాల్సిందిపోయి తిరిగి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే పదవులున్నాయి...భవిష్యత్తులో మన పరిస్థితేంటనే భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. ఎందుకంటే, ఉద్యమం కారణంగా ఇప్పటికే కాపు సామాజిక వర్గం మండిపోతోంది. ఏ దశలోనూ అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. జేఏసీ నాయకులు కూడా చంద్రబాబు, టీడీపీ నేతల్ని టార్గెట్ చేసుకునే ఉద్యమం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతల్లో చెప్పుకోలేని టెన్షన్ మొదలైంది. ఏదేమైనప్పటికీ ముందుకెళితే నుయ్యి– వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా పచ్చనేతల పరిస్థితి తయారైంది.