రాష్ట్రంలో నిరంకుశ పాలన
వైఎస్సార్‌సీపీకి చెందిన కాపునేతలపై అక్రమ కేసులు
వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
కోరుకొండ : రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మంగళవారం కోరుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతగా మారాడని జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు.ఎన్నికల్లో చంద్రబాబు కాపు కులస్తులను బీసీ జాబితాలో చేరుస్తానని , కాపు కులాల వారు అడకుండానే హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హమీని అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తుంటే దానిని అడ్డుకోవడం దారుణమన్నారు. హిట్లర్ మించి చంద్రబాబు పాలన ఉందని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభంతో ఫొటో దిగినా, ముద్రగడ ఫొటోతో ఫ్లెక్సీ వేసుకున్న వారిపై కూడా కేసులు పెట్టడడం సిగ్గుచేటన్నారు. కాపు కులస్తులను అన్ని విధాలా చంద్రబాబు పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు ఎలా చూస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే వైఎస్సార్‌సీపీకి చెందిన కాపు నేతలు, రైతులకు నోటీసులు ఇస్తూ, బైండోవర్ కేసులు పెడుతున్నారని, టీడీపీ చెందిన కాపు నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపు కులస్తులను ముద్రగడ పద్మనాభం పాదయాత్ర పేరుతో వేధిస్తున్నారని, కాపు కులస్తులు భయపడేది లేదన్నారు. కాపు కులస్తులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు బొరుసు బద్రి, తోరాటి శ్రీను, ఆరిబోలు చినబాబు, పాలం నాగవిష్ణు, యర్రంశెట్టి పొలారావు, వుల్లి ఘణ, దేవన దుర్గాప్రసాద్, చిక్కిరెడ్డి సురేష్, దేవన బాబీ, దోసపాటి దుర్గారావు, మారిశెట్టి అర్జునరావు , గుగ్గిలం భాను తదితరులున్నారు.