అడుగు పడనీయ లేదు
అడుగు పడనీయ లేదు
Published Thu, Jul 27 2017 11:02 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
– రెండో రోజు ఇంటి నుంచి బయటకొచ్చిన ముద్రగడ
– గేటు వద్దే నిలిపివేసిన పోలీసులు
– వారం రోజులపాటు గృహ నిర్బంధం
– ఎప్పుడు వెళ్లనిస్తే అప్పుడే వెళతానన్న ముద్రగడ
– జిల్లాలో ముద్రగడకు మద్దతుగా మహిళల నిరసనలు
– అణిచివేస్తున్న పోలీసులు
– కొనసాగుతున్న చెక్‌పోస్టులు, పికెట్లు
– కాపు నేతల వద్ద పోలీసుల కాపలా
జిల్లాలో... 1336 మంది బైండోవర్ 256 మంది గృహ నిర్బంధం. వైఎస్సార్‌సీపీ కాపు నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజులు, గిరిజాల బాబులు ఎక్కడికి వెళ్లినా వారి వాహనాల్లోనే పోలీసులు వెన్నంటి నిఘా... తుని మండలం ఎస్.అన్నవరంలో ముద్రగడ పద్మనాభం వియ్యంకుడిని గురువారం పోలీసులు గృహ నిర్బంధించారు. చెక్‌పోస్టులు: 69 చెక్ పోస్టులు, 112 పికెట్లు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి పరిసర ప్రాంతాలు, ప్రత్తిపాడు, జగ్గంపేట జాతీయరహదారి, కోనసీమ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా వ్యాప్తంగా 7000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం: కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్రలో పోలీసులు రెండో రోజు కూడా అడుగు పడనీయ లేదు. బుధవారం ప్రకటించిన మేరకు ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో కలసి ఇంటి నుంచి ఉదయం 9 గంటలకు బయటకు రాగానే గేటు వద్దకు 9.6 గంటలకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధిచడం సరికాదని, కావాలంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడను ఆగస్టు 2వ తేదీ వరకు వారం రోజులపాటు గృహ నిర్భందిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులు ఎప్పుడు వెళ్లనిస్తే అప్పుడే పాదయాత్రకు వెళతానని పేర్కొంటూ ముద్రగడ తన అనుచరులతో తిరిగి ఇంటిలోకి వెళ్లిపోయారు. మొదటి రోజు బుధవారంతో పోల్చుకుంటే గురువారం ఉదయం ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల బలగాల హడావుడి కాస్త తగ్గింది. ముద్రగడకు మద్దతుగా గ్రామంలో దకాణాలు వరుసగా రెండో రోజు కూడా వ్యాపారులు మూసివేశారు.
ప్రభుత్వ తీరుపై మహిళల నిరసనలు...
కాపు సామాజికవర్గంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా, ముద్రగడకు మద్దతుగా జిల్లాలో కాపు సామాజికవర్గంతోపాటు, బీసీలు ఆందోళనలు చేశారు.
+ కిర్లంపూడి సమీపంలోని రాజుపాలెంలో మహిళలు మెరుపు ఆందోళన చేశారు. తమ సామాజికవర్గం పట్ట ప్రభుత్వడం అవలంబిస్తున్న తీరుపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. రోడ్డును అరగంటసేపు దిగ్బంధించారు. కిర్లంపూడి నుంచి వెళ్లిన మహిళా పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. కిర్లంపూడిలో బీసీలు ముద్రగడకు మద్దతుగా ఏనుగుల సెంటర్ ప్రాంతంలో ధర్నా చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.
+ అమలాపురంలో కాపు జేఏసీ నేతలు నళ్లా విష్ణుమూర్తి, నల్లా పవన్‌ను కాపులపై èచంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తలకు మాస్క్‌లు, మెడకు ఉరితాళ్లు వేసుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మరో కాపు ఉద్యమ నేత దివంగత నల్లా సూర్యచంద్రరావు చిత్రాలను కాపు నేతలు తమ ముఖాలకు మాస్క్‌లుగా ధరించి నిరసన తెలిపారు. ఎస్.అన్నవరంలో కాపులు స్వాంత్రయ్య సమరయోధుల విగ్రహాలకు క్షీరాభిక్షేకాలు చేసి నిరసన తెలిపారు.
+ మలికిపురంలో ర్యాలీ చేస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపేటలో అంబేడ్కర్ విగ్రహానికి మండల కాపు జేఏసీ కన్వీనర్ చీకట్ల ప్రసాద్ ఆధ్వర్యంలో కాపు యువత వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ చర్యలకు నిరసనగా శుక్రవారం కొత్తపేటకు బంద్ పిలుపునిచ్చారు. ముద్రగడ పాదయాత్రపై ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీకి రాజీనామా చేస్తామని సలాది రామకృష్ణ హెచ్చరించారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో కాపు నాయకులు నిరసన తెలియజేసి, గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయగా పోలీసులు అరెస్టు చేశారు.
కాపు నేతలపై పోలీసుల నిఘా...
జిల్లాలో బుధవారం బైండోవర్ చేసిన 1336 మంది కాపులు, గృహ నిర్బంధించిన 256 మంది నేతలపై పోలీసుల నిఘా పెట్టారు. వారు తమ అనుచరులను నిరసనల వైపు ప్రోత్సహించకుండా కట్టడి చేశారు. వైఎస్సార్‌సీపీ కాపు నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్, ఆకుల వీర్రాజులు, గిరిజాల బాబులు ఎక్కడికి వెళ్లినా వారి వాహనాల్లోనే పోలీసులు వెన్నంటి ఉన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలో ముద్రగడ పద్మనాభం వియ్యంకుడిని గురువారం పోలీసులు గృహ నిర్బంధించారు.
+ పెద్దాపురం నియోజక కాపు జెఎసీ కన్వీనర్ మలకల చంటిబాబును పెద్దాపురంలో హౌస్ అరెస్టు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 69 చెక్ పోస్టులు, 112 పికెట్లు కొనసాగుతున్నాయి. కిర్లంపూడి పరిసర ప్రాంతాలు, ప్రత్తిపాడు, జగ్గంపేట జాతీయరహదారి, కోనసీమ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా వ్యాప్తంగా 7000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ విశాల్ గున్ని కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవ్వరూ ప్రజలను ఆందోళనల వైపు ప్రోత్సహించకపోతే ప్రస్తుత పరిస్థితిని సడలించేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement