
ముద్రగడ ఆరోగ్యం మెరుగుపడాలని..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ మంగళవారం తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్నంబజారు (గుంటూరు) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ మంగళవారం తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజా వద్ద శ్రీ కోదండ రామాలయంలో పూజలు చేశారు. ఉద్యమానికి ఊపిరి పోసేలా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయం నుంచి కేకేఆర్ వరకు కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేత మాదా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను విస్మరించటం ఆ జాతికి ద్రోహం చేయటమేనన్నారు.
కాపు జాతి కోసం పాటుపడుతున్న ముద్రగడను తీవ్రవాదిలా చూడటం దారుణమన్నారు. కాపు నేత మలిశెట్టి సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పతనానికి కాపు ఉద్యమమే నాంది కాబోతోందని హెచ్చరించారు. కాపు అడ్వకేట్స్ జేఏసీ నేత గాదె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముద్రగడకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కాపు యువనేత కావటి విక్రమ్‌నాయుడు మాట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నా.. అక్రమ కేసులు బనాయించటం సిగ్గుచేటన్నారు.
తెలగ అభ్యుదయ జేఏసీ నేతలు గ్యాలం ప్రేమ్‌చంద్, నీలం ప్రసాద్, కళ్యాణం శివశ్రీనివాసరావు (కేకే), డాక్టర్ యిమడాబత్తుని కృష్ణమూర్తి, దాసరి రాము, బండి దుర్గ, బాలిశెట్టి విజయ్, అడ్వకేట్ జేఏసి నేత వైఎస్ సూర్యానారాయణ పాల్గొన్నారు.