పోలీసులపై ముద్రగడ ఫైర్
-కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
కాకినాడ : ప్రకాశం జిల్లా కారంచేడు పోలీస్స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో కాపు వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ బొప్పన పరిపూర్ణచంద్రరావును పోలీసులు అరెస్టు చేసి లాకప్‌డెత్ చేసిన ఘటన తన దృష్టికి వచ్చిందన్నారు.
తప్పు చేసిన వ్యక్తిని న్యాయస్థానం ద్వారా శిక్షించాలి తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని లాకప్‌డెత్‌కు పాల్పడటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వారే ప్రజల ప్రాణాలు తీయడమేమిటని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఆటో నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అపహరించి మూడు రోజులపాటు చిత్రహింసలు పెట్టడమే కాకుండా, కొట్టి చంపడం చూస్తూంటే ఈ ప్రభుత్వమే పథకం ప్రకారమే కాపు సామాజిక వర్గం ప్రతిష్టను దెబ్బతీసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఉందని ఆరోపించారు.
వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన వ్యక్తిని విచారణ పేరుతో ఎందుకు కారంచేడు తరలించారని ముద్రగడ పోలీసులను ప్రశ్నించారు. లాకప్‌డెత్‌పై ఉన్నత స్థాయి విచారణ జరిపి... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి ముద్రగడ విజ్ఞప్తి చేశారు. పోలీసుల దుశ్చర్యను ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు.