ముద్రగడ హౌస్ అరెస్ట్
కాపు ఉద్యమనేత పాదయాత్రపై ఉక్కుపాదం
ఇంటి వద్దే అడ్డగింత.. కిర్లంపూడిలో భారీగా బలగాలు
ఉదయమే జిల్లావ్యాప్తంగా కాపు నేతల హౌస్ అరెస్టులు
నేడు రావులపాలెం బంద్‌కు కాపునేతల పిలుపు
ఎవ్వరిపైనా లేనివిధంగా కాపు జాతిపై ఆంక్షలా: ముద్రగడ
సాక్షి, రాజమహేంద్రవరం: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్రపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యాత్ర చేయడానికి అవకాశం లేకుండా పోలీ సులు ఆయన్ను ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్ర బాబు ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వే షన్లు కల్పించాలని కోరుతూ మలి విడత ఉద్య మంలో భాగంగా ముద్రగడ కాపు సత్యాగ్రహ పేరిట బుధవారం నుంచి పాదయాత్ర తల పెట్టడం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అమలాపురం వరకు ఐదు రోజులపాటు పాదయాత్రకు ఆయన సంకల్పించారు. పాదయాత్రలో పాల్గొనేం దుకు మంగళవారం సాయంత్రం ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసం నుంచి రావుల పాలెం బయలుదేరగా ఇంటిగేటు వద్దనే పోలీ సులు అడ్డుకున్నారు. జిల్లాలో 144వ సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని, పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. సీఆర్‌పీసీ సెక్షన్ 151సీ ప్రకారం హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో ముద్రగడ వెనుదిరిగారు.
హిట్లర్‌ను తలపిస్తున్నారు..
హౌస్ అరెస్ట్ అనంతరం ముద్రగడ తన నివా సంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన ఛాయలు కనిపిస్తున్నాయని విమర్శించారు. పోలీసులు తమకు స్వేచ్ఛ కల్పించినప్పుడే పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన యాత్ర ఆగినట్లు కాదన్నారు. మళ్లీ ఎప్పుడు యాత్ర ప్రారంభించాలో కాపు జేఏసీతో చర్చించాక వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరిపైనా లేనివిధంగా కాపు జాతిపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంటే బాబు మౌనంగా ఉంటున్నారని, ఎన్నికల వేళ కాపు జాతికిచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో నిరసన వ్యక్తం చేస్తుంటే సీఎంకు ఎక్కడలేని కోపం, పౌరుషం వస్తున్నాయని ధ్వజమెత్తారు.
గతేడాది తన ఇంటికొచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల బృందం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిం చారు. తెలంగాణలో ఒక్కరోజులోనే సర్వే పూర్తి చేశారని, రాష్ట్రంలో పల్స్ సర్వే నెలల తరబడి కొనసాగుతోందని విమర్శించారు. మంజునాథ కమిషన్ గడువు గత ఆగస్టుతోనే పూర్తయినా ఇప్పటివరకు నివేదిక ఎందుకివ్వ లేదన్నారు. నివేదిక రాకుండానే తొందరెందు కని సీఎం అంటున్నారని, 9 నెలల సమయం సరిపోదని కమిషన్ వేసేటప్పుడు తెలియదా? అని నిలదీశారు. ఇప్పటికే మూడేళ్లు గడిచి పోయాయని, రిజర్వేషన్లు అమలు చేయడా నికి తమ నుంచి సీఎం ఏం ఆశిస్తున్నారో చెప్పాలన్నారు. కేసుల పేరుతో బెదిరించడం మాని దమ్ముంటే తమను అరెస్టులు చేయాల న్నారు. పోలీసులతో తమ జాతి ప్రజలను బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు.
పాదయాత్రకు అనుమతి లేదు
ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేకపోవ డంతో ఆయన్ను సీఆర్‌పీసీ సెక్షన్ 151 ప్రకా రం హౌస్ అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ చెప్పారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. జిల్లాలో 144వ సెక్షన్, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని, ఐదుగురు వ్యక్తులు గూమిగూడి ఉంటే అరెస్ట్ చేస్తామన్నారు. ఇతర జిల్లాలవారు ఇక్కడికి రావొద్దన్నారు.
వ్యూహాత్మకంగా పోలీసులు
పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జిల్లా లోని కాపు నేతలు కిర్లంపూడి రాకుండా ఉదయం పదిగంటలకే ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు. కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా పవన్, కల్వకొలను తాతా జీ, కాపు నేతలు, వైఎస్సార్‌సీపీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, ఆకుల వీర్రాజులను గృహ నిర్బం ధంలో ఉంచారు. జిల్లావ్యాప్తంగా ఆరువేల మంది పోలీసులను మోహరించారు. రెండు వేల మంది పోలీసులతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఐదుగురు ఐపీఎస్ అధికారులు, పదిమంది డీఎస్పీలు కిర్లంపూడిలో పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా ముద్రగడ హౌస్ అరెస్ట్‌ను నిరసిస్తూ జిల్లా కాపు నేతలు బుధవారం రావులపాలెం బంద్‌కు పిలుపునిచ్చారు.
శాంతిభద్రతల సమస్య వల్లే గృహనిర్బంధం: డీజీపీ
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతిలేదని, శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉన్నందునే ముద్రగడతో పాటు కాపు జేఏసీ నేతలను హౌస్ అరెస్టు చేశామని డీజీపీ నండూరి సాంబశివరరావు ప్రకటించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూనేరు వద్ద హీరాఖండ్ రైలు దుర్ఘటనలో కుట్రకోణానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లభించలేదని, సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ చెప్పారు. పోలీస్ శాఖలోని పలువురిపై ఆరోపణలు చేసిన ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు చీఫ్ కాంతరావును వివరణ కోరతామని చెప్పారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణను ఉల్లంఘించి రచ్చకెక్కడం సరికాదని, కాంతారావు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ శాఖపరమైన విచారణ నిర్వహిస్తామని డీజీపీ వెల్లడించారు.