అష్టదిగ్బంధనంలో కిర్లంపూడి
జగ్గంపేట: కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ బుధవారం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు కిర్లంపూడిని అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఇప్పటికే 1,100 మంది పోలీసులు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడికి చేరుకున్నారు. గ్రామంతో పాటు శివారు ప్రాంతాల్లో వీరంతా మోహరించారు. దీంతో కాపు వర్గాల్లో ఆందోళన మొదలైంది. ముద్రగడకు మద్దతు తెలిపేందుకు ఆయన అభిమానులు కిర్లంపూడికి భారీగా తరలివస్తున్నారు.
సోమవారం జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు ముద్రగడను కలిశారు. కాగా, గతేడాది నవంబర్ 16న జరపతలపెట్టిన యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని ముద్రగడను గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఈనెల 25న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ఆరు రోజుల పాటు సత్యాగ్రహ యాత్ర చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఈసారి కూడా అనుమతి లేదంటూ యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతు న్నట్లు సమాచారం.