మండపేట : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పౌల్ట్రీలు నెలకొల్పి అత్యధికంగా కోళ్లను పెంచుతున్న శ్రీలక్ష్మీ ఎగ్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కర్రి వెంకట ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్) బిగ్గెస్ట్ లేయర్ ఫార్మర్ అవార్డుతో సత్కరించింది. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, సుదర్శన్ భగత్ చేతులమీదుగా ముకుందరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ముగ్గురిని ఎంపిక చేయగా అందులో జిల్లాకు చెందిన ముకుందరెడ్డి ఒకరు కావడం గమనార్హం. కేపీఆర్ గ్రూప్స్‌లో భాగంగా 1998లో 2 లక్షల కోళ్లతో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో శ్రీలక్ష్మీ పౌల్ట్రీ కాంప్లెక్స్‌ను నెలకొల్పిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా విస్తరించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 28 లక్షల లేయర్ కోళ్లను పెంచుతున్నారు.
అత్యధికంగా లేయర్ కోళ్లను పెంచుతున్నందుకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర వ్యవసాయ శాఖ సహకారం అందించాల్సిందిగా కేంద్ర మంత్రులను కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. న్యూఢిల్లీ నుంచి 'సాక్షి'తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. స్థానికంగా గుడ్ల వినియోగం పెంచేందుకు కృషి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా తెగుళ్ల బెడదతో పౌల్ట్రీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, చిన్న పౌల్ట్రీలు మూతపడుతున్న విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కోళ్ల మేతల కృత్రిమ కొరత సమస్యను పరిష్కరించాలని, మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులను కోళ్ల రైతులకు రాయితీపై సరఫరా చేయాలని కోరామని తెలిపారు. ఈ మేరకు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్టు ముకుందరెడ్డి తెలిపారు.