గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో రాష్ట్రం | world egg day | Sakshi
Sakshi News home page

గుడ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో రాష్ట్రం

Published Fri, Oct 14 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

world egg day

  • పరిశ్రమ అభివృద్ధి వల్లే చౌకగా గుడ్లు, మాంసం లభ్యం
  • ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
  • ఘనంగా ప్రపంచ గుడ్డు దినోత్సవం
  • అనపర్తి(బిక్కవోలు) : 
    రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే గుడ్ల ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. దీన్ని మొదటి స్థానంలోకి తెచ్చేందుకు వివిధ రాయితీలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా అనపర్తి ఏరియా కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వేడుకలు బిక్కవోలు మండలం బలభద్రపురం ఎమ్మెస్సార్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అనపర్తి జీబీఆర్‌ కాలేజీ నుంచి సుమారు వెయ్యి మందితో 2కే రన్‌ను ఎమ్మెల్యే ఎన్‌.రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రన్‌లో నెక్‌ రైతులతో పాటు విద్యార్థులు పాల్గొని గుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం బలభద్రపురం ఫంక్షన్‌ హాల్లో జరిగిన సభలో చినరాజప్ప మాట్లాడుతూ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే సామాన్యుడికి గుడ్డు, కోడి మాంసం అతి చౌకగా లభిస్తున్నాయన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కోళ్ళ రైతులకు ఏడు శాతం సబ్సిడీతో ఏడాదికి రూ.50 కోట్ల వరకూ రుణాలు అందిస్తుందన్నారు. పౌల్ట్రీ రంగ పితామహుడు డాక్టర్‌ బి.వి.రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
    శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కల్తీకి ఆస్కారం లేని ఆహారం కోడిగుడ్డు అన్నారు. గుడ్డులో పోషకాలను గుర్తించిన ప్రభుత్వం అంగన్‌వాడీ చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్లు చొప్పున అందిస్తుందన్నారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ మన్మోçßæన్‌ సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ 11.02 శాతం అభివృద్ధి సాధించి రూ.10 వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నామన్నారు. జిల్లా నెక్‌ చైర్మన్‌ పడాల సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోడిగుడ్డు పూర్తిగా శాఖాహారమని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చన్నారు. జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు, శ్రీనివాసా హేచరీస్‌ జేఎండీ కె.సోమిరెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం ‘కోడిగుడ్డుతో పలు రకాల వంటకాలు’ పుస్తకాన్ని మంత్రి సుజాత, గుడ్డు శాఖాహారం వాల్‌పోస్టర్‌ను మంత్రి చినరాజప్ప ఆవిష్కరించారు. కేర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ బి.సరళా రాజ్యలక్ష్మి, కేపీఆర్‌ సంస్థల చైర్మన్‌ కొవ్వూరి పాపారెడ్డిలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, తేతలి ఉపేంద్రరెడ్డి, అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, బిక్కవోలు, అనపర్తి ఎంపీపీలు బేరా వేణమ్మ, ఉమామహేశ్వరి, నెక్‌ ఆడ్వయిజర్‌ కె.బాలాస్వామి, శ్రీనివాసా హేచరీస్‌ వైస్‌ చైర్మన్‌ సురేష్‌రాయ్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement