పత్తాలేని ఆనాటి సందడి
పత్తాలేని ఆనాటి సందడి
Published Sat, Aug 13 2016 6:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
ఆలేరు : ఆటలు ఆరోగ్యాన్ని పంచుతాయి.. ఆయుష్‌ను కూడా పెంచుతాయి. ఆట అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు క్రీడలు ఆడుతుంటే వాటిపై విద్యార్థి దశలో వాటిపై పట్టు పెరుగుతుంది. దురదృష్టవశాత్తు పాఠశాలల్లో ఎక్కడ నిత్యం క్రీడలు ఆడిపించడం లేదు. అయితే ఒకప్పుడు గణతంత్ర, పంద్రాగస్టు వేడుకలు వస్తున్నాయంటే పది రోజుల ముందు నుంచే ప్రతి పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించే వారు. అప్పట్లో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసే వారు. నేడు ఆ సందడి కరువైంది. ఫలితంగా ఆటలకు నోచుకోక విద్యార్థులు నిరాశ, నిసృహలకు లోనవుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో అంతే సంగతులు. ప్రైవేట్ పాఠశాలల్లో వార్షికోత్సవాల సందర్భంగా తూతూమంత్రంగా క్రీడలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో మొక్కుబడిగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. బాల్యంలో ఆటలే చక్కని ఆరోగ్యం. ఈ వయసులో పిల్లలు చదువుతో పాటు కనీసం గంట సేపు ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ఖో–ఖో, వాలీబాల్, పుట్‌బాల్, సాఫ్ట్‌బాల్, స్పీడ్‌బాల్, టెన్నికాయిట్ తదితర ఆటలు ఆడేలా చూడాలి. క్రీడలతో పాటు యోగా, «ధ్యానం సాధన చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించగల శక్తి వస్తుంది. కొన్ని పాఠశాలల్లో మైదానాలుంటే పీఈటీలు ఉండడం లేదు. పీఈటీలు ఉంటే మైదానాలు ఉండడం లేదు.
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం ..
పిల్లలు తీసుకునే ఆహారం ద్వారా లభించే కేలరీలు, ఖర్చు చేసే కేలరీలు సమానంగా ఉన్నప్పుడే శరీరం సమతుల్యంగా, నాజూకుగా ఉంటుంది. విద్యార్థి దశ నుంచే అలవడితే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎముకలు పటిష్టంగా తయారు అవ్వడమే కాకుండా ఆక్సిజన్ శరీర భాగాలన్నింటికీ సమానంగా అందుతుంది. దీనివల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఆటలు ఆడేటప్పుడు శరీరం, మనసు ఒకేలా స్పందించి చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులు, ప్రతిభావంతులుగా తయారవ్వాలంటే ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
Advertisement
Advertisement