► మున్సిపల్ పాఠశాలల్లో పూర్తిగా తెలుగు మీడియం రద్దు
► ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్
► ఆందోళనలకు సిద్ధమవుతున్న సంఘాలు
► తెలుగుకు దూరం కానున్న 37,378 విద్యార్థులు
దేశభాషలందు తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాషను కీర్తిస్తే.. టీడీపీ సర్కార్ మాత్రం మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు ‘లెస్’ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఓ పక్క తెలుగు భాషను కాపాడుకునేందుకు భాషాభిమానులు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క ప్రభుత్వం పూర్తిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. తెలుగు భాషను కాపాడుకునే చర్యల్లో భాగంగా ఇప్పటికే యూటీఎఫ్ శాఖ బుధవారం అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించింది.
- రాయవరం
మాతృభాషపై అంత అక్కసు ఎందుకో..
తెలుగు జాతిని ఉద్ధరిస్తామని.. తెలుగు తేజాన్ని దశదిశలా వ్యాప్తి చేస్తామంటూ చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ పాలనలో తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న నిర్ణయంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తి కానున్న తరుణంలో అత్యవసరంగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్పు చేయాల్సిన అవసరం ఏ మొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాతృభాషపై.. ప్రభుత్వానికి అంత అక్కసు ఎందుకని.. కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందా? అంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే యూటీఎఫ్ ఆందోళనబాట పట్టింది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడంలో తప్పులేదు కానీ.. సమాంతరంగా తెలుగు మీడియం కూడా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది.
నేడు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ..
మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ సెక్రటరీ ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం విజయవాడలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు తమ వాణిని వినిపించబోతున్నాయి. ఉత్తర్వులు విడుదల చేసే ముందే ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి సాధ్యాసాధ్యాలపై చర్చించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు.
తక్షణం జీవోను రద్దు చేయాలి..
విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం సరికాదు. ప్రభుత్వం తక్షణం జీవో 14 రద్దు చేయాలి. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం తగదు. తెలుగు మీడియం కూడా కొనసాగించాలి. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ
డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మున్సిపల్ స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి. పాఠ్య పుస్తకాలు లేకుండా, ఇంగ్లిష్ మీడియం బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ లేకుండా హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం తుగ్లక్ చర్యలను తలపిస్తోంది. ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం ఉండాల్సిందే. –టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
విద్యార్థులకు నష్టమే..
మున్సిపల్ శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరకపోగా, నష్టం కలుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు మాధ్యమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. హడావుడి నిర్ణయాలు విద్యావ్యవస్థలో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తాయి.
– చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ
దశలవారీగా అమలు చేస్తే..
మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలనుకోవడం మంచిదే. అయితే దశలవారీగా అమలు చేస్తే బాగుండేది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తే మరింత బాగుండేది. – తోట సత్య, విద్యార్థి తల్లి, మండపేట
వారి పరిస్థితి ఏమిటి..
ఇంగ్లిష్ మీడియం చదవని వారి పరిస్థితి ఏమిటి? ఒక్కసారిగా అన్ని తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే ఎలా చదువుతారు. ప్రభుత్వం పునరాలోచించాలి. – ఐనవిల్లి దుర్గ, విద్యార్థి తల్లి, మండపేట