మహిళల పట్ల కమిషనర్ అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్: వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడంటూ మున్సిపల్ కమిషనర్ శంకరరావుపై శుక్రవారం యూనియన్ నేతలు దాడికి యత్నించారు. చాంబర్‌లో ఉన్న ఆయన్ను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వెళ్లిపోవాల్సిందిగా ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. బద్వేలు మున్సిపల్ కమిషనర్‌గా ఎ.శంకరరావు జూన్30న బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో ముగ్గురు కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు అటెండర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమను కమిషనర్ వేధిస్తున్నారని వారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సీపీఐ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారు యూనియన్, సీపీఐ నేతలతో కలిసి వచ్చి కమిషనర్‌తో గొడవకు దిగారు.
ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు సరిగా లేదని నేతలు కమిషనర్‌ను చాంబర్ నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆయనతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేస్తూ దాడికి యత్నించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న చైర్మన్ సోమేసుల పార్థసారథి, పలువురు కౌన్సిలర్లు యూనియన్ నేతలను మందలించి కమిషనర్‌ను లోపలికి తీసుకెళ్లారు. కొద్ది రోజులు సెలవుపై వెళ్లాల్సిందిగా మున్సిపల్ చైర్మన్.. కమిషనర్‌కు సూచించారు. కాగా, సక్రమంగా విధులు నిర్వర్తించమన్నందుకే తనపై నిందలు వేస్తున్నారని కమిషనర్ శంకరరావు పేర్కొన్నారు. కార్యాలయంలో ఒకరు ఉండి.. మిగతా ఇద్దరు పారిశుద్ధ్య పనులకు వెళ్లాలని చెప్పడం వల్లే ఇలా గొడవ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో కేసు నమోదు కాలేదు.