అంతర్జాతీయ ఖ్యాతికి కృషి
అంతర్జాతీయ ఖ్యాతికి కృషి
Published Fri, Jul 7 2017 11:37 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
- డిసెంబరు నాటికి ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు
- త్వరలో పెద్ద విమానాల సేవలు
- ఎయిర్‌పోర్టు అడ్వయిజరీ కమిటీ చైర్మెన్, ఎంపీ మాగంటి మురళీ మోహన్ వెల్లడి
మధురపూడి : రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ చైర్మెన్, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ వెల్లడించారు. ఆయన అధ్యక్షతన శుక్రవారం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనంలో ఎడ్వయిజరీ కమిటీ (సలహా సంఘం) సమావేశం జరిగింది. దీనిలో ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి, మధురపూడి గ్రామంలో సర్వీసు రోడ్లు, పామాయిల్ తోటలిచ్చిన రైతులకు పరిహారం అందజేత, అభివృద్ధి, ప్రయాణికులకు సేవలు విస్తృతం, సౌకర్యాలు పెంపు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ 1,749 మీటర్లున్న రన్ వేను 3,165 మీటర్లకు విస్తరించినట్టు పేర్కొన్నారు. అలాగే ఒకేసారి 4 పెద్ద విమానాలు, 8 హెలీకాఫ్టర్లను పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఏఫ్రాన్ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పంటలు, పండ్లు, పూలను విదేశీ, స్వదేశాలకు పంపడానికి కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎమ్.రాజ కిశోర్ మాట్లాడుతూ కార్గో విమాన సర్వీసులతో రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. ఎంపీ మురళీ మోహన్ చైర్మన్‌గా ఉన్న కమిటీకి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కో–చైర్మన్‌గా, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కన్వీనర్‌గా, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అయితే శుక్రవారం జరిగిన సమావేశానికి కలెక్టర్ మిశ్రా, ఎస్పీ రాజకుమార్‌లు హాజరు కాలేదు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం ఇన్‌చార్జి సబ్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజు, ఎయిర్‌పోర్టు అధికారులు పాల్గొన్నారు.
ముగ్గురు సభ్యులు నియామకం
ఎయిర్‌పోర్టు ఎడ్వయిజరీ కమిటీ సభ్యులుగా ముగ్గురు నియమితులయ్యారు. రాజమహేంద్రవరానికి చెందిన కాశీ నవీన్‌కుమార్, రాజానగరానికి చెందిన మోది సత్తిబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అవంతి సీడ్స్ వ్యాపారవేత్త అల్లూరి ఇంద్ర కుమార్ రాజు నియమితులయ్యారు.
Advertisement