వేధింపులు తాళలేక హత్య
-
కుటుంబ వివాదాలే కారణం
-
ముద్దాయి అరెస్టు
-
వీరాస్వామి హత్యకేసు ఛేదించిన పోలీసులు
ఐ.పోలవరం:
కుటుంబ కలహాల్లో చిన్నాన్న వేధింపులను తాళలేక ఆయననే హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఐ. పోలవరం పంచాయతీ బాణాపురానికి చెందిన రాయపురెడ్డి వీరాస్వామి (74)ను చంపింది ఆయన అన్న సుబ్బారావు కుమారుడు బాణేశ్వరరావే అని పోలీసులు జరిపిన దర్యాప్తులో తేలింది. పాతయింజరం పోలీస్ స్టేషన్‌లో సీఐ కేటీవీవీ రమణరావు గురువారం విలేకరుల సమావేశంలో ఆవివరాలను వెల్లడించారు. వీరాస్వామి తన ఇంటి వెనుక ఉన్న బాణేశ్వరరావు స్థలాన్ని వాస్తురీత్యా ప్రహరీ నిర్మించుకొనేందుకు ఇవ్వమని కోరాడు. దానికి ప్రతిఫలంగా తన ఇంటికి ఆగ్నేయ మూల ఉన్న 4 కొబ్బరి చెట్లను ఇస్తానని చెప్పాడు. ఆమేరకు 15 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందం మేరకు బాణేశ్వరరావు రెండు సెంట్ల భూమిని వీరాస్వామికి ఇవ్వగా ప్రహరీ నిర్మించుకొన్నాడు. వీరాస్వామికి చెందిన నాలుగు చెట్ల కొబ్బరికాయలను బాణేశ్వరరావు తీసుకుంటున్నాడు. అయితే వీరాస్వామికి ఇష్టం లేని పనులు (వీరాస్వామి కొడుకు అనారోగ్యంతో ఉండగా బాణేశ్వరరావు సాయం చేయడం) చేస్తున్నాడని ఏడాది కాలంగా వీరాస్వామి తరచూ బాణేశ్వరరావుతో గొడవలకు దిగేవాడు. అంతేకాకుండా ఏడాది కాలంగా కొబ్బరికాయలను తీయనీయలేదు. ఇదిలా ఉండగా ఈనెల 13వ తేదీన బాణేశ్వరరావు తన ఇంటికి ఆనుకొని ఉన్న కొబ్బరితోట దుక్కు దున్నుతుండగా వీరాస్వామి పనివాళ్లతో గొడవపడ్డాడు. అంతేకాకుండా బాణేశ్వరరావును గాయపరచాడు. దాంతో తనను తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని వీరాస్వామిపై బాణేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కక్ష పెట్టుకొన్న బాణేశ్వరరావు ఈనెల 14వ తేదీన వీరాస్వామి కిరాణా షాపుకు వెళ్తున్నాడని తెలుసుకొని సంచిలో కత్తి పెట్టుకొని మోటారుసైకిల్‌పై పోలవరం ఊరిలోకి వెళ్లాడు. S విజయాబ్యాంక్ సమీపంలో వీరాస్వామి తారసపడటంతో మోటారు సైకిల్ పక్కన పాడేసి కత్తి తీసి అతి దారుణంగా వీరాస్వామిని ఇష్టమొచ్చినట్టు నరికి చంపాడు. నిందితుడు రాయపురెడ్డి బాణేశ్వరరావును బుధవారం సాయంత్రం అతని ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేసి, నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని, మోటారు సైకిల్‌ను స్వాధీన పరుచుకున్నారు. ముద్దాయిని గురువారం ముమ్మిడివరం కోర్టులో హాజరు పరుస్తున్నట్టు సీఐ తెలిపారు. డీఎస్పీ ఎల్.అంకయ్య పర్యవేక్షణలో సీఐ కేటీవీవీ రమణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట స్థానిక ఎస్సై టి.క్రాంతి కుమార్, సిబ్బంది ఉన్నారు.