వీడిన హత్య కేసు మిస్టరీ
వీడిన హత్య కేసు మిస్టరీ
Published Wed, May 17 2017 11:15 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
ముగ్గురు నిందితుల అరెస్టు
రూ. 59 వేలు, మోటరు సైకిల్ స్వాధీనం
రావులపాలెం (కొత్తపేట) : ఈ నెల 8న రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో లంక ప్రాంతంలో జరిగిన బెల్లంకొండ రాంబాబు (50) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.59 వేలు, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమలాపురం డీఎïస్పీ ఎల్. అంకయ్య ఈ కేసు వివరాలు వెల్లడించారు.
రావులపాలెంలో చికెన్ సెంటరు నిర్వహించే బెల్లంకొండ రాంబాబుతోపాటు రావులపాలేనికి చెందిన కడలి నాగేశ్వరరావు, ఊబలంకకు చెందిన పడాల శ్రీనివాసరెడ్డి, రావులపాలెం కొత్తకాలనీకి చెందిన మానుపాటి శ్రీను స్థానిక గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలో కుడి ఏటిగట్టు దిగువన ఉన్న లంక ప్రాంతంలోని దుబ్బుగడ్డి పొదల్లో పేకాట ఆడుతుంటారు. ఈ నెల 8 తేదీ ఉదయం రావులపాలెంలో కలుసుకున్న వీరు పేకాటకు వెళ్లే ముందులో మద్యం సేవించారు. రాంబాబు వద్ద పెద్దమొత్తంలో నగదు ఉన్నట్టు వారు గమనించారు. పేకాట స్థావరంలో రాంబాబు రూ.50 వేల విలువైన రూ.2 వేల నోట్లను పెట్టగా.. మిగిలిన వారు కొన్ని రూ.100 నోట్లను పెట్టారు. దీనిపై రాంబాబు ప్రశ్నించడంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడగా, ఖాళీ మద్యం సీసాతో రాంబాబు తలపై బలంగా కొట్టారు. స్పృహ కోల్పోయిన అతడి తలను శ్రీనివాసరెడ్డి కాలితో తొక్కిపెట్టాడు. అతనికి శ్రీను, నాగేశ్వరరావు సహకరించడంతో రాంబాబు మృతి చెందాడు. అనంతరం రాంబాబు పెట్టిన రూ.50 వేలతోపాటు అతడి జేబులోని మరో రూ.10 వేలను, అతని మోటారు సైకిల్ తీసుకుని పరారయ్యారు. కుటుంబ సభ్యులకు 9 తేదీన సంఘటనా ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. సీఐ బి.పెద్దిరాజు పర్యవేక్షణలో ఇన్‌చార్జి ఎస్సై జేమ్స్‌రత్నప్రసాద్ తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంలో తలపై గాయాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్పు చేశారు. అతనితో పేకాడేందుకు వచ్చిన మిగిలిన ముగ్గురు హత్యకు పాల్పడినట్టు ఆధారాలు దొరకడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.59 వేలు, మోటారు సైకిల్, హత్య చేసేందుకు ఉపయోగించిన మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కొత్తపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హజరుపర్చనున్నట్టు డీఎస్పీ అంకయ్య తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో కృషి చేసిన సీఐ పెద్దిరాజు, ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్, ఏఎస్సై ఆర్‌వీ రెడ్డి, హెచ్‌సీలు శ్రీను, స్వామి, కానిస్టేబుళ్లు రమేష్, హరికృష్ణలను డీఎస్పీ అభినందించారు.
Advertisement