నిందితులను పట్టించిన సెల్‌ఫోన్
- మిస్టరీ వీడిన జంట హత్యల కేసు
–పోలీసుల అదుపులో నిందితులు?
శింగనమల : శింగనమల సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల 19న జరిగిన జంట హత్యల కేసు పోలీసులకు సవాలుగా మారింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయినా ఎటువంటి ఆధారం దొరకలేదు. చివరకు హత్యకు గురైన వ్యక్తి సెల్‌ఫోన్ హంతకులను పట్టించింది. హంతకులు 20 సంవత్సరాలు లోపు యువకులు కావడంతో పోలీసులే అశ్చర్య పోయారు.
గుప్తనిధుల కోసం వెళ్లి...
బుక్కరాయసముద్రం మండలంలోని బి.కొత్తపల్లికి చెందిన ఒక దేవాలయం పూజారి కుమారుడు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు గుప్తనిధుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. అందులో భాగంగానే శింగనమల సమపంలోని రుష్యశృంగుని కొండపైన గుప్త నిధుల కోసం ఒక స్నేహితుడితో కలిసి గత నెల 18న పరిశీలించారు. 19వ తేదిన వారు మరో ఇద్దరితో కలిసి రుష్యశృంగుని కొండపైకి రెండు ద్విచక్ర వాహనాల్లో వెళ్లారు. అప్పటికే కొండపైన బత్తలపల్లికి చెందిన పెద్దయ్య, వీఆర్‌ఏ ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రి ఉన్నారు. దీంతో వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే డబ్బు కోసం వారిపై దాడి చేశారు. ఈదాడిలో వారు తీవ్రంగా గాయపడడంతో వారి వద్ద నగదు, పెద్దయ్యకు చెందిన సెల్‌ఫోన్ తీసుకుపోయారు. దాడిలో పెద్దయ్య అక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్య మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయాలు తగిలిన సావిత్రి కాస్త కోలుకుంది.
సెల్‌ఫోన్ ఆధారంగా..
పెద్దయ్య సెల్‌పోన్‌ను అనంతపురంలోని ఒక సెల్‌పాయింట్‌లో హత్యలకు పాల్పబడిన ప్రధాన నిందితుడు విక్రయించాడు. ఆ సెల్‌ఫోన్ ఆన్ చేయడంతో..దీనిపై నిఘా ఉంచిన పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌పాయింట్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వివరాలు ఆరా తీశారు. వెంటనే సెల్‌ఫోన్ విక్రయించిన బి.కొత్తపల్లికి దేవాయం పూజారి కుమారుడిని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. అలాగే మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసున్నారు.