వీడిన హత్యకేసు మిస్టరీ
ఇద్దరి అరెస్టు
రాజానగరం : ముక్కినాడలో తీవ్ర సంచలనం సష్టించిన మట్టపర్తి మణికంఠేశ్వరస్వామి (25) హత్య కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. అనపర్తికి చెందిన కర్రి జగదీశ్వరరెడ్డితో పాటు అతడికి సహకరించిన గొండెల ఎర్రయ్యలను అరెస్టు చేసి, శనివారం కోర్టుకు హాజరు పరిచారు. వివరాలను రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కె.రమేష్‌బాబు స్థానిక విలేకరులకు వివరించారు.
ముక్కినాడకు చెందిన మట్టపర్తి మణికంఠేశ్వర స్వామి అన పర్తిలోని ఒక కంటి ఆస్పత్రిలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసే విజయతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వయస్సులో ఉన్న ఇద్దరు ఒకరికొకరు మనస్సును, తనువును ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే విజయని గాఢంగా ప్రేమిస్తున్న అనపర్తికి చెందిన కర్రి జగదీశ్వరరెడ్డికి వీరిద్దరి వ్యవహరం నచ్చలేదు. అంతేకాక మణికంఠస్వామి పరిచయంతో తనను పక్కన పెట్టిందనే అక్కసుతో పలుమార్లు ఇద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా ఎటువంటి మార్పు రాకపోవడంతో ఎలాగైనా మణికంఠస్వామిని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో గత ఏడాది సెప్టెంబర్‌లో మణికంఠస్వామికి వేరొక అమ్మాయితో వివాహం కావడంతో ఇక ఫర్వాలేదనున్నాడు. కానీ అతను విజయని వదలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న వారిద్దరూ రాజమహేంద్రవరం సినిమాకు Ððవెళ్లిన విషయం తెలుసుకుని, తిరుగు ప్రయాణంలో మణికంఠ స్వామిని హతమార్చాలని పథకం వేసుకున్నాడు. స్నేహితుడైన గొండెల ఎర్రయ్యకు విషయం తెలియజేసి, అతడి సహాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి మోటారు బైకుపై ముక్కినాడకు సమీపంలో రోడ్డు మలుపు వద్ద కాపు కాచారు. ప్రియురాలు విజయతో కలసి రాజమహేంద్రవరంలో సినిమా చూసి, హోటల్‌లో భోజనం చేసి, తిరిగి వస్తూ ఆమెను అనపర్తిలో దించి, బైకు ఒంటరిగా ఇంటి వస్తున్న మణికంఠేశ్వరస్వామిని ముక్కినాడ సమీపంలో దారికాచి వున్న వీరు అడ్డగించి, తల పై రాడ్‌తో బాదారు. నన్ను చంపవొద్దు అంటూ పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోతున్న అతడి కాళ్లను ఎర్రయ్య పట్టుకోగా జగదీశ్వరరెడ్డి పీక నులిమి చంపేశాడు. శవాన్ని వరి పొలంలోకి లాక్కుపోయి పడవేశారు. ఆ సమయంలో జగదీశ్వరరెడ్డి చేతి కడియం అక్కడ జారిపడడంతో దాని ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన రాజానగరం పోలీసులు నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. విషయం తెలుసుకుని విశాఖపట్నం పారిపోయిన నిందితులు, చివరకు శుక్రవారం ముక్కినాడ వచ్చి వీఆర్వో సమక్షంలో లొంగిపోయారని డీఎస్పీ వివరించారు. వారిద్దరినీ కోర్టులో హాజరు పరిచామన్నారు. సమావేశంలో ఎస్సై రాజేష్ కూడా పాల్గొన్నారు.