కట్నం కోసమే కడతేర్చారు
- వరకట్న వేధింపులకు బలైపోయిన వివాహిత
- ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన అత్తారింటివాళ్లు
- గత నెల 31న ఘటన
- చికిత్స పొందుతూ శుక్రవారం మృతి
- మెజిస్ట్రేట్‌కు మరణ వాంగ్మూలం
- నలుగురిపై హత్య కేసు నమోదు
దొర్నిపాడు: అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తింటివారు వేధిస్తున్నా భరిస్తూ వచ్చిన ఆమె చివరకు తనను చంపేస్తారని మాత్రం ఊహించలేకపోయింది. రోజురోజుకు వేధింపులు పెరుగుతున్నా పుట్టినింటివారు సైతం సర్ధుకుపోవాలని నచ్చజెబుతుండడం, పసి పిల్లలు అనాథలవుతారన్న భయం కారణంగా సహించింది. అదే చివరకు ఆమె చేసిన తప్పిదంగా మారి ప్రాణాలు బలిగింది. భర్త, అత్త, మామ, బావలు కలిసి అతి దారుణంగా నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి పెట్రోల్‌పోసి నిప్పంటించారు. వారం కిత్రం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ చివరకు శుక్రవారం మరణించింది. ఈ ఘటన దొర్నిపాడు మండలం చాకరాజువేములలో చోటుచేసుకుంది.
ఆళ్లగడ్డ ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన విజయకుమార్ కుమార్తె జయమ్మ (22)ను చాకరాజువేముల ఎస్సీకాలనీకి చెందిన గరికెల జయమ్మ, గరికెల పెద్దమునయ్య కుమారుడు బ్రహ్మమునయ్యకు ఇచ్చి11 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. వీరికి జయసింహ(9), జయవేణి (7) సంతానం. జయమ్మ చాకరాజువేముల ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తుండేది. కొంతకాలంగా భర్త, అత్త, మామ, బావ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో తీవ్ర మానసికక్షోభకు గురైంది. విషయంపై తండ్రి, అన్న, అక్క వద్ద మొరపెట్టుకున్నా సర్దుకుపోవాలని చెప్పడంతో పిల్లలకోసం భరిస్తూ అత్తారింట్లోనే కాలం వెళ్లదీసింది. చివరకు వేధింపులు పెరిగిపోయి గత నెల 31న ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. విషయం గ్రహించిన స్థానికులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక జయమ్మ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది.
మా అమ్మను చంపేశారు..
మా అమ్మను నాన్నతోపాటు పెద్దనాన్న నాగరాజు, నానమ్మ జయమ్మ, అబ్బ మునయ్య చంపేశారు. ఆ రోజు రాత్రి మేం బయటపడుకున్నాం. అమ్మను ఇంట్లోకి తీసుకెళ్లి చేతులు కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కారు. తర్వాత పెట్రోలు పోసి అగ్గిపెట్టెతో అంటించి పారిపోయారు.
మృతురాలి మరణ వాంగ్మూలం..
ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృతురాలు ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్‌కు మరణ వాంగ్మూలం ఇచ్చింది. భర్త, అత్త, మామ, బావ కలిసి తన ఒంటికి నిప్పు పెట్టి చంపేశారని చెప్పింది. ఈ మేరకు దొర్నిపాడు పోలీసులు నలుగురిపై హత్యకేసు నమోదు చేశారు.