ఆస్తి కోసం... సోదరుడే.. కాలయముడై..
►కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి...
►ముసుగు ధరించి హత్య చేసిన దుండగులు
ఆస్తి కోసం తమ్ముడే కాలయముడయ్యాడు... అన్నను వేటాడి వెంటాడి నరికి చంపాడు... వదిన, సోదరుడి పిల్లల శోకానికి కారకుడయ్యాడు... చివరకు అతను కూడా జైలు పాలయ్యాడు.
ప్రొద్దుటూరు క్రైం: పెద్దలు సంపాదించిన ఆస్తి అన్నదమ్ముల మధ్య వైరాన్ని పెంచి.. ప్రాణం మీదికి తెచ్చింది. మండల పరిధిలోని కానపల్లె రహదారిలో సోమవారం ఆకుల శ్రీనివాసులరెడ్డి (40)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైకులో వెళ్తున్న అతన్ని కారుతో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండారెడ్డిపల్లెకు చెందిన ఆకుల శ్రీనివాసులరెడ్డికి వెంకటసుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారికి బెంగళూరుతోపాటు స్వగ్రామంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం అతనికి ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వనతేజతో వివాహం అయింది. వారికి అజయ్, మనోజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వనతేజ తల్లి చనిపోవడంతో కానపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న ఆరవేటి «థియేటర్ కాంప్లెక్స్‌లో మీ సేవా కేంద్రాన్ని నిర్వహించే వాడు. కృష్ణారెడ్డి కూడా కానపల్లెలోని వనతేజ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు. అతను కూడా ఉదయగిరిలో మీ సేవా కేంద్రాన్ని నిర్వహించే వాడు.
ఆస్తి కోసం తరుచూ గొడవలు:
ఆస్తి కోసం తరుచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. శ్రీనివాసులరెడ్డి తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను మృతి చెందాక కృష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య ఆస్తి తగాదాలు మరింత పెరిగాయి. ఘర్షణలకు సంబంధించి నెల్లూరులోని వరికుంటపాడు పోలీస్‌స్టేషన్‌లో నాలు గు కేసులు ఉన్నాయి. తరుచూ గొడవలు జరుగుతుండటంతో శ్రీనివాసులరెడ్డి కానపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు.
8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై దాడి
8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై అన్న దాడి చేశాడు. పడుకొని ఉన్న అతన్ని వాహనంలో తీసుకొని వెళ్లి విచక్షణా రహితంగా కొట్టి, తీవ్రంగా గాయ పరచినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి అతను మీ సేవా కేంద్రాన్ని మూసివేసి శ్రీనివాసులరెడ్డిని చంపడానికి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరాయి హంతకులతో కలసి అతను పలుమార్లు ప్రొద్దుటూరుకు వచ్చి శ్రీనివాసులరెడ్డి నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రం, అతను ఇంటికి వెళ్లే రూట్‌లను గుర్తించినట్లు సమాచారం.
కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి..
మీసేవా కేంద్రం నుంచి శ్రీనివాసులరెడ్డి సోమవారం మధ్యాహ్నం భోజనానికి బైక్‌లో కానపల్లె గ్రామానికి బయలుదేరాడు. అతని కోసం కాపు కాచిన నలుగురు దుండగులు ఏపీ26 ఎన్ 7007 అనే నంబరు కలిగిన ఇండికా కారులో వెంబడించారు. మైదుకూరు రోడ్డులో వెళ్తున్న శ్రీనివాసులరెడ్డి కొత్తపల్లె చెక్‌పోస్టు వద్ద నుంచి కానపల్లె మార్గం మీదుగా వెళ్లాడు. కానపల్లె సమీపంలోని దర్గా వద్దకు వెళ్లగానే వెనుక వైపున వస్తున్న కారుతో ఢీ కొట్టడంతో అతను కింద పడిపోయాడు. అయితే ప్రమాదం జరిగిందేమోనని అతనికి సాయపడేందుకు పొలంలో పని చేస్తున్న కూలీలు పరుగెత్తుకుంటూ రోడ్డు వైపు వచ్చారు. ఈ లోపే ముసుగులు ధరించిన నలుగురు దుండగులు కారులోంచి దిగి కింద పడిపోయిన శ్రీనివాసురెడ్డిని వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వారు తరలించారు.
అయితే వైద్యులు పరీక్షించే లోపే అతను మృతి చెందాడు. విషయం తెలియడంతో భార్య వనతేజ ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించసాగింది. తండ్రి మరణించడంతో కుమారులు రోదిస్తున్నారు. రూరల్ సీఐ ఓబులేసు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, స్థానికులను విచారణ చేశారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పోలీసుల అదపులో నిందితులు
శ్రీనివాసులరెడ్డిని హత్య చేసిన నిందితులు మైదుకూరు వైపు పారిపోయారని సమాచారం తెలియడంతో పోలీసులు అన్ని మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట సమీపంలోని బోయినపల్లె వద్ద ము గ్గురు నిందితులను రాజంపేట డీఎస్పీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.