‘నా కార్యాలయం.. నా ఇష్టం’ | my office my rules zp chairperson | Sakshi
Sakshi News home page

‘నా కార్యాలయం.. నా ఇష్టం’

Published Sat, Mar 12 2016 2:14 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

‘నా కార్యాలయం.. నా ఇష్టం’ - Sakshi

‘నా కార్యాలయం.. నా ఇష్టం’

జడ్పీ సీఈవో వితండవాదం
‘స్థాయీ’ భేటీలకు మీడియా వద్దే వద్దు
వైస్‌చైర్మన్, జడ్పీటీసీలు, జర్నలిస్టుల ధర్నా

 సాక్షి, సంగారెడ్డి : జడ్పీ సీఈఓ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. గురువారం స్థాయీ సంఘం సమావేశాలకు విలేకరులను అనుమతించిన సీఈఓ వర్షిణి శుక్రవారం మళ్లీ పాతపల్లవే అందుకున్నారు. ఆమె తీరును నిరసిస్తూ వైస్ చైర్మన్ సారయ్య, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, శోభారాణిపాండు, ఇందిర, మొయిజుద్దీన్, అమీనుద్దీన్ స్థాయీ సంఘం సమావేశాన్ని బహిష్కరించి జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ప్రభాకర్, టీడీపీ జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో పాల్గొని సీఈఓ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సమావేశం నిలిపివేత..
స్థాయీ సంఘం సమావేశంలో గురువారం జర్నలిస్టులను అనుమతించిన సీఈఓ శుక్రవారం ప్లేటు ఫిరాయించారు. సమావేశంలోకి జర్నలిస్టులను అనుమతించేదిలేదన్నారు. అయితే, జర్నలిస్టులు లేనిదే తాము సమావేశం ప్రారంభించేది లేదని జడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, శోభ, ఇందిర అధికారులకు స్పష్టం చేశారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రారంభం కాలేదు. చివరకు సీఈఓ వర్షిణి.. వైస్‌చైర్మన్ సారయ్య, జడ్పీటీసీ సభ్యులతో సుమారు గంట పాటు చర్చించారు. ఆమె ఎంతకీ పంతం వీడకపోవడంతో తాము సమావేశం బహిష్కరిస్తున్నట్లు సారయ్య స్పష్టం చేశారు. అనంతరం సమావేశ మందరింలోకి వచ్చిన సీఈఓ జర్నలిస్టులను పంపించి వేయాలని సిబ్బందికి సూచించారు. గురువారం అనుమతించి ఈ రోజు ఎందుకు అనుమతించటం లేదని జర్నలిస్టులు ప్రశ్నించగా ‘నా కార్యాలయం..నాఇష్టం’.అంటూ ఆమె వాగ్వాదానికి దిగారు. సీఈఓ వర్షిణి తీరు వల్ల సమావేశాల సమయం వృథా అవుతోందని అధికారులు అంటున్నారు.

 సీఈఓ నిరంకుశ వైఖరి: సారయ్య
జడ్పీ సీఈఓ నిరంకుశంగా వ్యవహరిస్తోందని జడ్పీ వైస్‌చైర్మన్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీలు లేకుండానే కలెక్టర్ అనుమతితో సమావేశాలు నిర్వహిస్తానని చెప్పటం దారుణమన్నారు. ఆమెపై మంత్రి హరీష్‌రావు, చైర్‌పర్సన్ రాజమణి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ సోమవారం జరిగే స్థాయీ సంఘం సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ప్రభాకర్ మాట్లాడుతూ జడ్పీ సీఈఓ నియంతలా వ్యవహరిస్తోంద న్నారు. టీడీపీ జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం జిల్లాలో సీఈఓ ఇలా వ్యవహరించడం దారుణమని, ఇవి జడ్పీకి చీకటిరోజులన్నారు. ఆమె తమకు, మీడియాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, శోభారాణి పాండు మాట్లాడుతూ వర్షిణి మండలాల్లో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందుల పాలుచేస్తున్నట్లు ఆరోపించారు. ధర్నాలో జర్నలిస్టులు జేఏసీ అధ్యక్షుడు కృష్ణ, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, జర్నలిస్టు సంఘం నాయకులు రమేశ్, మురళి, విష్ణు, ప్రసన్న, రవి, ఆరిఫ్, శ్యాంసుందర్‌రెడ్డి, నాగరాజుగౌడ్, సునీల్, అశోక్‌రెడ్డి, రాజుగౌడ్, సత్తార్, సతీష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement