
నా రెండో పెళ్లిని అడ్డుకోండి
► భర్త ప్రమాద బీమా సొమ్ము కోసం
► తల్లిదండ్రుల కుట్రలు
► ప్రకాశం, నెల్లూరు ఎస్పీలకు
► వివాహిత హసీనా వినతి
నెల్లూరు (బృందావనం) : తన భర్త ప్రమాద బీమా సొమ్ము కోసం, తనకు రెండో పెళ్లి చేసి తద్వారా లభించే సొమ్మును అనుభవించేందుకు, అత్త, మామలతో పాటు పిల్లల నుంచి దూరం చేసేందుకు తన తల్లిదండ్రులు కుట్రలు పన్నుతున్నారని వారి నుంచి తనకు, తన ముగ్గురు కుమారులకు రక్షణ కల్పించాలని బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మునులపూడికి చెందిన షేక్ హాసీనా పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తన అత్త, మామ మస్తాన్‌బాషా, ముంతాజ్, మామ సోదరి రజియాబేగంతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టుకు చెందిన షేక్ హాసినాకు మునులపూడికి చెందిన ఏసీ టెక్నీషియన్ షేక్‌మస్తాన్‌బాషాతో 2007లో వివాహమైంది. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మస్తాన్‌బాషా హైదరాబాద్ నుంచి నెల్లూరుకు 2011 మే 14న ఒంగోలు ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి 2014 వరకు బుచ్చిరెడ్డిపాళెంలోనే ఉంటూ తన పిల్లలును చదివిస్తూ అత్త,మామల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో తన తండ్రి మహబూబ్‌షరీఫ్ మునులపూడికి వచ్చి తల్లికి కిడ్నీలు చెడిపోయి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పి దేవరాజుగట్టుకు తీసుకెళ్లారన్నారు. అయితే ఇంటి వద్ద తన తల్లి ఆరోగ్యంగా ఉండడం చూసి వారిని ప్రశ్నించానన్నారు.
తన భర్త రోడ్డు ప్రమాదానికి సంబంధించి రూ.14 లక్షలు బీమా ఉందని, ముగ్గురు పిల్లలను తమకు అప్పగిస్తే ఆ డబ్బు తమకు చెందుతుందని చెప్పారన్నారు. తనకు రిటైర్డ్ ఉద్యోగితో రెండో పెళ్లి చేస్తామని బలవంతం చేశారన్నారు. దీనికి తాను అంగీకరించక తిరిగి రావడంతో మార్కాపురం నుంచి కొందరు రౌడీలను తీసుకువచ్చి తన ముగ్గురు పిల్లలను తీసుకెళ్లారన్నారు. ఈ విషయమై నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.