వీడిన ఏడు నెలల మిస్టరీ | mystery reveal after 7 months | Sakshi
Sakshi News home page

వీడిన ఏడు నెలల మిస్టరీ

Published Mon, Aug 8 2016 6:29 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

వీడిన ఏడు నెలల మిస్టరీ - Sakshi

వీడిన ఏడు నెలల మిస్టరీ

చోరీ విషయం బయటపడుతుందనే హత్య!
7 నెలల తర్వాత వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ
నిందితుడిని పట్టించిన సెల్‌ఫోన్‌ కాల్‌డేటా
వివరాలు వెల్లడించిన తాండూరు రూరల్‌ సీఐ సైదిరెడ్డి

తాండూరు రూరల్‌: ఏడు నెలల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడితోపాటు అతడికి సహకరించిన కుటుంబీకులను కటకటాల వెనక్కి పంపారు. తన చోరీ విషయం బయటపడుతుందని భయపడి గతంలో పనిచేసిన పాలేరు వృద్ధురాలి గొంతు నులిమి చంపేశాడు. కేసు వివరాలను రూరల్‌ సీఐ సైదిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని మిట్టబాస్పల్లికి చెందిన పట్లోళ్ల అనసూజమ్మ(81) గత ఏడాది డిసెంబర్‌ 25న హత్యకు గురైంది. ఆమె రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు గొంత నులిమి చంపేశారని పోలీసులు గుర్తించి విచారణ ప్రారంభించారు.

           మిట్టబాస్పల్లికి చెందిన షేక్‌ ఇస్మాయిల్‌ గతంలో అనసూజమ్మ ఇంట్లో పదేళ్లు పాలేరుగా పనిచేశాడు. అనంతరం పనిమానేసి ఖాళీగా తిరుగుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గతంలో తాను పాలేరుగా పనిచేసిన అనసూజమ్మ ఇంటిని ఎంచుకున్నాడు. ఈక్రమంలో గత డిసెంబర్‌ 24న రాత్రి అతడు అనసూజమ్మ ఇంట్లోకి చొరబడ్డాడు. దేవుడి గదిలో ఉంచిన హుండీలో ఉన్న రూ. వెయ్యితో పాటు 8 గ్రాముల బంగారం, ఒక సెల్‌ఫోన్‌ అపహరించాడు. అలికిడికి అనసూజమ్మ నిద్రలేచింది. చోరీకి పాల్పడిన ఇస్మాయిల్‌ను గుర్తించింది. ఇస్మాయిల్‌ అనసూజమ్మ తన చోరీ విషయం బయటకు చెబుతుందని భయపడ్డాడు. దీంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి ఇంటికెళ్లాడు.

          మరుసటి రోజు ఇస్మాయిల్‌ వద్ద ఉన్న డబ్బును గమనించిన అతడి భార్య నసీమాబేగం గొడవకు దిగింది. దీంతో ఇస్మాయిల్‌ను తండ్రి ఫక్రొద్దీన్‌ నిలదీశాడు. జరిగిన విషయాన్ని ఇస్మాయిల్‌ కుటుంబీకులకు చెప్పాడు. భయాందోళకు గురైన ఫక్రొద్దీన్‌ కొడుకు, కోడలిని కరణ్‌కోట గ్రామానికి వలస పంపాడు. అయితే గత రంజాన్‌ పండుగ సమయంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చోరీ చేసిన 8 గ్రాముల బంగారాన్ని విక్రయించాలని ఇస్మాయిల్‌ నిర్ణయించుకున్నాడు. అంతారం అనుబంధ దస్తగిరిపేటలోని తన సమీప బంధువు ఇబ్రహీంకు బంగారం ఇవ్వడంతో అతడు తాండూరు పట్టణంలోని ఓ జ్యువెలరీ షాపులో విక్రయించాడు. చోరీ చేసిన సెల్‌ఫోన్‌ను ఇస్మాయిల్‌ ఓ హిటాచీ డ్రైవర్‌కు రూ.600కు విక్రయించాడు. సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు హిటాచీ డ్రైవర్‌ను విచారించారు. దీంతో ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరుపగా తానే హత్య చేశానని నేరం అంగీకరించాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన భార్య నసీమాబేగం, తండ్రి ఫక్రొద్దీన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement