చంపుతాడేమోనని భయపడి చంపేశాడు!
♦ వీడిన యువకుడి హత్య మిస్టరీ
♦ నిందితుడి అరెస్టు
♦ వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్‌కుమార్
రంగారెడ్డి జిల్లా: శామీర్‌పేట్ యువకుడి హత్య మిస్టరీ వీడింది. డబ్బుల విషయమై తనను చంపుతాడేమోననే భయంతో హతుడి తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి అతడిని చంపేశాడు. శామీర్‌పేట్ ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్ సీఐ సత్తయ్యతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. గురువారం మండలంలోని మజీద్‌పూర్ శివారులో ఐలయ్య అనే వ్యక్తి హత్య వెలుగుచూసిన విషయం తెలిసిందే.
మండలంలోని మూడుచింతలపల్లికి చెందిన బుడగజంగం చింతల గోపాల్(52) పశువుల కాపరి. అతడు మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన సత్తమ్మతో సహజీవనం చేస్తూ మజీద్‌పూర్‌లో ఉంటున్నాడు. ఆమెకు ఓ కూతురుతోపాటు కుమారుడు ఐలయ్య(28) ఉన్నాడు. ఐలయ్య గజ్వేల్‌లోని ఓ సినిమా థియేటర్‌లో పనిచేస్తూ తరచూ తల్లి వద్దకు వస్తుండేవాడు. అయితే, తల్లి, గోపాల్ సంపాదన విషయంలో ఐలయ్య గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 26 సాయంత్రం ఐలయ్య మజీద్‌పూర్ వచ్చి ఇంటి అరుగు మీద నిద్రించాడు. తల్లితోపాటు వచ్చిన గోపాల్‌తో అతడు తిరిగి డబ్బుల విషయమై గొడవపడ్డాడు. రాత్రి 9గంటల సమయంలో సత్తమ్మ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. అనంతరం ఐలయ్య, గోపాల్‌తో మళ్లీ ఘర్షణకు దిగారు.
గోపాల్‌ను చంపుతానని ఐలయ్య బెదిరించాడు. తనను చంపుతానని ఐలయ్య బెదిరించడంతో గోపాల్ భయపడ్డాడు. తనను ఎలాగైనా అంతం చేస్తాడని భావించాడు. ఐలయ్యతో తనకు ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందనుకున్నాడు. ఈ క్రమంలో ఐలయ్యను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు రాత్రి 11:30 గంటలకు గోపాల్ తన ఇంట్లో ఉన్న రాతి రోలును ఐలయ్య తలపై మోదడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఐలయ్య చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన గోపాల్ ఇంట్లో మృతదేహం ఉంటే తనపై అనుమానం వస్తుందని భావించి దానిని అక్కడి నుంచి ఊరు బయట పడవేయాలనుకున్నాడు. గ్రామ పంచాయతీ చెత్త తీసుకెళ్లే రిక్షాను తీసుకొచ్చి ఐలయ్య మృతదేహాన్ని అందులో వేసి గ్రామ శివారులోని మజీద్‌పూర్-మేడ్చల్ రహదారి పక్కన పడేశాడు. ఘటన వెలుగుచూసిన రోజు పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. హతుడి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. ఈమేరకు గోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా హత్య విషయం అంగీకరించి పైవిషయాలు వెల్లడించారు.