బురదజల్లుడుకు తాయిలం
- మైసూరా సిమెంటు ఫ్యాక్టరీకి భూమి కేటాయింపు
- అధికారపార్టీలో చేరనున్న మైసూరా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని వదిలివెళ్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శల బురదచల్లిన మాజీ మంత్రి మైసూరారెడ్డికి తగిన ప్రతిఫలం దక్కింది. ఆయన కుటుంబ సభ్యుల నేతృత్వంలో స్థాపించనున్న ‘తేజ సిమెంటు ఫ్యాక్టరీ’కి ఎర్రగుంట్ల మండలంలో 140 ఎకరాల ప్రభుత్వభూమి కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న ఈ భూమి మార్కెట్ విలువ రూ.25 లక్షలకు పైగా ఉండగా.. ప్రభుత్వం ఎకరా రూ.2.5 లక్షలకు కేటాయిస్తూ అనుమతి ఇచ్చింది. పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వ భూమి దక్కడం, ఇదివరకే ప్రైవేటు భూములను కొనుగోలు చేసిన నేపథ్యంలో తేజ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈలోపే ఆగస్టులో టీడీపీలో చేరేందుకు మైసూరా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తేజ సిమెంటు ఫ్యాక్టరీ ప్రమోటర్‌గా మాజీమంత్రి మైసూరారెడ్డి సోదరుడు శ్రీనివాసులరెడ్డి, షేర్‌హోల్డర్లుగా మరికొంతమంది మైసూరా బంధువులు ఉన్నట్లు సమాచారం. స్థానిక రెవెన్యూ అధికారులు అభ్యంతరం చెప్పినప్పటికీ మైసూరాకు మేలు చేసేందుకే.. ప్రభుత్వం ఆ అభ్యంతరాలను పట్టించుకోలేదని సమాచారం. అంతేకాదు ఈ భూమిలో ఓ వాగు ఉన్నప్పటికీ ఎలాంటి ఆక్షేపణ లేకుండా భూమి కేటాయించేందుకు తీర్మానించింది. తాను ఆశించినట్లు తమ ఫ్యాక్టరీకి ప్రభుత్వం భూమి కేటాయించడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైసూరా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.