కోనసీమలో నాఫెడ్ కేంద్రం?
కోనసీమలో నాఫెడ్ కేంద్రం?
Published Wed, May 17 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
సర్వేకు వస్తున్న ఆయిల్‌ఫెడ్ అధికారులు
స్థానిక కొబ్బరి రైతులకు సమాచారం
అమలాపురం/ అంబాజీపేట : కోనసీమలో మరోసారి నాఫెడ్ కేంద్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఆయిల్‌ఫెడ్ అధికారులు రెండు, మూడు రోజుల్లో మార్కెట్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందింది. అంబాజీపేట మార్కెట్‌లో ఎండు కొబ్బరి క్వింటాల్ ధర రూ.7 వేల వరకూ ఉంది. ఇదే సమయంలో వెయ్యి పచ్చికాయల ధర రూ.7 వేలు ఉంది. పచ్చికాయ, ఎండుకొబ్బరి ధరలు ఒకేలా ఉండడంతో రైతులు ఎండుకొబ్బరి తయారీ దాదాపు నిలిపివేశారు. గత ఫిబ్రవరిలో క్వింటాల్ రూ.8.500 ఉండగా, పచ్చికాయ ధర కూడా రూ.8,500 ఉంది. మార్చి నాటికి ఎండుకొబ్బరి ధర రూ.8 వేలకు, పచ్చికాయ ధర రూ.7 వేలకు తగ్గింది. ఏప్రిల్ నెలలో ఎండుకొబ్బరి ధర రూ.7,800, పచ్చికాయ ధర రూ.7,300 తగ్గింది. తాజాగా ఈ రెండు ఉత్పత్తుల ధరలు రూ.ఏడు వేలకు చేరాయి. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది.
సిండికేట్‌గా మారిన వ్యాపారులు?
డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేటుగా మారి ధరలు తగ్గిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఎండు కొబ్బరిని కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. బయట మార్కెట్ కన్నా ఇది తక్కువే అయినా కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే ధర మరింత పతనమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమలో కాకున్నా కనీసం కొబ్బరి వాణిజ్య కేంద్రమైన అంబాజీపేటలోనైనా నాఫెడ్ కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు పట్టుబడుతున్నారు.
ఇటీవల విజయవాడలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఈ విషయంపై భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల జమ్మిల్ నుంచి వివరాలు సేకరించారు. మార్కెట్‌లో ధర ఉంది కదా? ఇప్పుడెందుకు కేంద్రాలని ఆయన ప్రశ్నించారు. నెల రోజుల నుంచి ధర పడిపోతోందని, కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రైతులు మరింత నష్టపోతారని బీకేఎస్ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఆయన నాఫెడ్‌కు నోడల్ ఏజెన్సీ అయిన ఆయిల్‌ఫెడ్ అధికారులకు ఈ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఇందుకు స్పందించిన ఆ సంస్థ అధికారులు కోనసీమలో మార్కెట్ సర్వే చేసేందుకు రెండు, మూడు రోజుల్లో వస్తున్నట్టు స్థానిక రైతు సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో...
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల్లో పెద్దగా కొనుగోళ్లు లేకున్నా.. రైతులకు కొంతలో కొంతైనా కనీస మద్దతు ధర దక్కుతోంది. ఇవి లేకుంటే ఇప్పుడున్న ధర కూడా రాదని రైతుల అభిప్రాయం. కొబ్బరి రైతులు సైతం ఇదే తరహాలో తమకు నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement