
‘పరువునష్టం’ నోటీసులు వస్తే ఎదుర్కొంటా
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టీకరణ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత నుంచి తనకు పరువునష్టం దావా నోటీసులు వస్తే వాటిని చట్టపరంగా ఎదుర్కొంటానని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ దమ్ము ధైర్యం లేని రాజకీయాలు చేస్తోందని అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్ప లేకనే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు.నగరి నియోజవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సమస్యలను దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌కు తెలియజేసేందుకు బుధవారం చెన్నైకి వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు.
టీడీపీతో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై పరువునష్టం దావా వేసిన ఎమ్మెల్యే అనితను టీడీపీ బలిపశువుగా వాడుకుంటున్నందుకు బాధపడుతున్నానని రోజా అన్నారు. అసెంబ్లీలో అంశాలంటూ అవాస్తవాలను సోషల్ మీడియాకు విడుదల చేసిన కాల్వ శ్రీనివాసులపై ఆమె పరువునష్టం దావా వేయాలన్నారు. ఈ కేసులో నోటీసులు అందితే న్యాయ పోరాటంలో భాగంగా వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.