బత్తలపల్లి : పంటనష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోకుండా అబద్ధాలతో మోసపుచ్చుతున్నారని వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో ఎండిపోయిన వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. బాధిత రైతు పెద్దిరెడ్డితో మాట్లాడారు. ‘నేను మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన విత్తనాలే వేశాను. పూతే రాలేదు సార్. ఊడలు దిగే సమయంలో వర్షాలు పడలేదు. పంట ఎండిపోతున్నా రెయిన్‌గన్లు కూడా ఇవ్వలేదు’ అని రైతు తెలిపాడు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వర్షాభావంతో పంటలు ఎండి.. రెయిన్‌గన్‌లతో రక్షక తడులు అందక నష్టాలపాలైన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.170 కోట్లు ఖర్చు పెట్టి రెయిన్‌గన్‌లను తీసుకువచ్చి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇంటిలో భద్రపరుచుకుంటే రైతులు పంటలను ఎలా కాపాడుకుంటారని ప్రశ్నించారు. రైతులను ఆదుకోకపోతే కంచుకోటగా ఉన్న ‘అనంత’లో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు అక్కిం నరసింహులు, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంగళరెడ్డి, సర్పంచులు సూర్యనారాయణరెడ్డి, సంజీవు, కాశప్ప, జయచంద్రారెడ్డి, జయరామిరెడ్డి, చల్లా క్రిష్టా, ముసలయ్య, పరేష్, లింగారెడ్డి, కప్పల నారాయణస్వామి, ప్రసాద్‌రెడ్డి, పాళ్యం అప్పస్వామి, పామాల నాగభూషణ, బాల ఈరప్పగారి అప్పస్వామి, తప్పెట పెద్దన్న, టీసీ కాటమయ్య, పోట్లమర్రి హనుమంతరెడ్డి, వెంకటరెడ్డి, సుధాకరరెడ్డి, కమతం ఆంజనేయులు, ధర్మవరం మండల నాయకులు పాల్గొన్నారు.